నగరి : డైయింగ్ యూనిట్లు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా పరిశీలించేందుకు సాంకేతిక అధికారిని నియమించినట్లు మున్సిపల్ కమిషనర్ బాలాజీ నాయక్ తెలిపారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో డైయింగ్ యూనిట్ల యజమానులు, పర్యావరణ పరిరక్షణ సమితి సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. ప్రతి డైయింగ్ యూనిట్‌ను పరిశీలించేందుకు తమిళనాడు నుంచి సాంకేతిక నిపుణుడిని రప్పించి నియమించడం జరిగిందన్నారు. ఇప్పటికే అతను నాలుగు డైయింగ్ యూనిట్లు పరిశీలించి అవంతా పద్ధతి ప్రకారం నడవడం లేదని గుర్తించినట్టు తెలిపారు. డైయింగ్ యూనిట్ల వారికి అవగాహన కూడా కల్పించాల్సి ఉందని సూచించారని తెలిపారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ ఇటీవల సక్రమంగా లేవని అధికారులే గుర్తించి కొన్ని డైయింగ్ యూనిట్లను మూసివేశారన్నారు. అయితే అవి ప్రస్తుతం నిర్వహణలో ఉన్నాయని, మూయడానికి కారణాలు చెప్పే అధికారులు ఏ కారణాలతో మళ్లీ ఆ యూనిట్లు నిర్వహణలోకి వస్తాయో చెప్పడం లేదన్నారు. రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధిత నిపుణులు వచ్చి పరిశీలించినవే మళ్లీ తెరచుకుంటుంటే తమిళనాడు నిపుణుడు సక్రమంగా లేదని సూచించినా ఫలితం ఎక్కడ ఉంటుందన్నారు. సాంకేతిక అధికారి తప్పిదం కనుగొంటే వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. వీలైనంత త్వరలో డైయింగ్ యూనిట్లను ఊరికి దూరంగా పంపాలనదే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారమని సూచించారు. ఈ కార్యక్రమంలో డైయింగ్ యూనిట్లు యజమానులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.


