● చేనేతల కోర్కెల ప్రచార దినోత్సవంగా నిర్వహణ ● రాష్ట్రంలోని 2.79 లక్షల మందిలో తొలుత 93 వేలకు కుదింపు ● నేడు 51,952 మందికి తగ్గించిన వైనం ● 81 వేల మరమగ్గాలను తొలుత 10,534 కుదింపు ● నేడు 7 వేలకు సర్దుబాటు
పుత్తూరు: వ్యవసాయం తర్వాత అతిపెద్ద ఉపాధి రంగం చేనేత.ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ రంగం ప్రస్తుతం దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటోంది. లయబద్దంగా వినబడే మరమగ్గాల ధ్వని వినిపించడం తగ్గిపోతోంది. చేనేతలు చాలీచాలని కూలీలతో రోడ్డున పడుతున్నాయి. మరమగ్గ కార్మికులు సైతం పెరిగిన విద్యుత్ ఛార్జీలను కట్టలేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చాలా వరకు మగ్గాలను నిలిపేస్తూ, అయిన కాడికి తెగనమ్ముకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో చేనేత కార్మికులను ఆదుకుంటానని ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా హామీలు నెరవేర్చలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది నేత కార్మికుల సంఖ్యను వేలల్లోకి తగ్గించారు. నూలు, పట్టు చేనేత కుటుంబాలు 2.79 లక్షల మంది ఉండగా 93 వేలకు కుదించారు. మరమగ్గాలు 81 వేలు ఉండగా 10,534 ఉన్నట్టు జీఓ 44ను విడుదల చేశారు. తీరా ఉచిత విద్యుత్, నేతన్న సేవా పథకం అమలుకు తాను ఇచ్చిన జీఓలోని 93 వేల మంది నేత కార్మికులను 51,952 మందికే పరిమితం చేశారు. అలాగే పవర్ లూమ్స్‌ను 7 వేలకు కుదించారు.
నేతన్న నేస్తంతో ఆదుకున్న గత ప్రభుత్వం
జిల్లాలో చేనేతపై ప్రత్యక్షంగా సుమారు 5 వేల మంది, పరోక్షంగా మరో 15 వేల మంది కార్మికులు ఆధారప డి జీవనం సాగిస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభు త్వం నేతన్న నేస్తం పథకం ద్వారా మగ్గం కలిగిన ప్రతి నేతన్నకూ ఏడాదికి రూ.24 వేల ఆర్థిక సాయం అందించింది. విద్యుత్ ఛార్జీల నుంచి 96 పైసల యూజ ర్స్ ఛార్జీలను తగ్గించింది. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూరైనా ఇంకా పథకం అమలుకు మీనమేషాలు లెక్కిస్తోంది.
దేశ సంప్రదాయ వృత్తిని కాపాడండి
దేశ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపమైన చేనేత వృత్తిని కాపాడుకోవల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లలో ఎక్కువ నిధులు కేటాయించడం ద్వారా ఈ రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించవచ్చు. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న చేనేత రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే నేటి జాతీయ చేనేత దినోత్సవాన్ని చేనేత కోర్కెల ప్రచార దినోత్సవంగా నిర్వహిస్తున్నాం. – ఆకుల వాసు, రాష్ట్ర చేనేత కార్మికుల యూనియన్ అధ్యక్షుడు, తిరుపతి


