బీసీ హాస్టల్‌లో అధికారుల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

బీసీ హాస్టల్‌లో అధికారుల తనిఖీ

Aug 7 2026 1:56 AM | Updated on Aug 7 2026 1:56 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా కేంద్రంలోని సంజయ్‌గాంధీ నగర్‌లో ఉన్న బీసీ హాస్టల్‌ను గురువారం కలెక్టర్‌ నియమించిన జిల్లా స్థాయి అధికారుల సంయుక్త కమిటీ తనిఖీ చేసింది. జిల్లా పరిషత్‌ సీఈవో రవికుమార్‌ నాయుడు ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి, డీఈవో, డీఎంఅండ్‌హెచ్‌వో, ఆరోగ్య భద్రత అధికారి, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల సంయుక్త కమిటీ హాస్టల్‌లోని వసతులను క్షుణ్ణంగా పరిశీలించింది. పరిసరాల పారిశుద్ధ్యం, విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహారం నాణ్యత, వంటగది శుభ్రత, తాగునీటి సౌకర్యం, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి, మరుగుదొడ్ల నిర్వహణ, వ్యర్థ్యాల తరలింపు, భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జెడ్పీ సీఈవో రవికుమార్‌ నాయుడు మాట్లాడుతూ హాస్టల్‌లో నివసించే విద్యార్థులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా పరిశుభ్రమైన, పోషకాహారంతో నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. హాస్టల్‌ ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. తాగునీటి నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థుల విషయంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఈవో లక్ష్మీనారాయణ, డీపీవో సుధాకర్‌, డీఎంహెచ్‌వో నాగశశిభూషన్‌రెడ్డి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement