పేదలకు పస్తులు | - | Sakshi
Sakshi News home page

పేదలకు పస్తులు

Aug 6 2026 2:14 AM | Updated on Aug 6 2026 2:14 AM

చిత్తూరు జిల్లాలోని 310 రేషన్‌ దుకాణాలకు అందని బియ్యం ఏర్పేడు నిల్వ కేంద్రం నుంచి రవాణాలో ఆలస్యం అల్లాడుతున్న 4.80 లక్షల మంది కార్డుదారులు కూటమి ప్రభుత్వం వచ్చాక లయ తప్పిన ప్రజా పంపిణీ వ్యవస్థ

జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ జిల్లాలో గందరగోళంగా మారింది. ప్రతినెలా ఆఖరు నాటికే చౌకధరల దుకాణాలకు సరుకులు చేరాల్సి ఉండగా అధికారుల అలసత్వం వల్ల పలుచోట్ల బియ్యం సరఫరా నిలిచిపోయింది. దీంతో నిరుపేద కుటుంబాలు పస్తులుండాల్సిన దుస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేషన్‌ బియ్యం సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతోందని, అనేక షాపుల్లో సరుకులు లేక నిల్వలు సున్నాకు చేరుతున్నాయని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,220 చౌకధరల దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు 4.80 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయి. జిల్లాలోని లబ్ధిదారుల అవసరాల నిమిత్తం ప్రతినెలా 7,200 మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరం అవుతోంది. ఈ నెల ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో నిల్వలు జిల్లాకు చేరుకోలేదు. ముఖ్యంగా ప్రధాన పంపిణీ కేంద్రమైన ఏర్పేడు గోదాముకు బియ్యం రావడంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. ఈ ప్రభావం జిల్లా వ్యాప్తంగా ఉన్న పంపిణీ వ్యవస్థపై పడింది. ఫలితంగా ఈ నెల ఏకంగా 310 రేషన్‌ షాపులకు గాను రావాల్సిన 1,000 మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరాకు పూర్తిగా బ్రేకులు పడింది.

షాపుల వద్ద పడిగావులు

ఈ నెల బియ్యం రాకపోవడంతో రేషన్‌ బియ్యంతో జీవనం సాగించే వేలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. బియ్యం ఎప్పుడు వస్తాయో తెలియక రేషన్‌ షాపుల వద్ద గంటల తరబడి పడిగావులు కాయాల్సి వస్తోందని కార్డుదారులు వాపోతున్నారు. కొన్ని నెలలుగా ప్రతిసారీ ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని మండిపడుతున్నారు. పౌరసరఫరాల శాఖ అధికారులు తక్షణమే స్పందించి బియ్యం సరఫరా చేసి ఆకలి తీర్చాలని లబ్ధిదారులు డిమాండ్‌ చేస్తున్నారు.

పేదల పొట్ట కొడుతున్న కూటమి

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ప్రతి నెలా ఒకటో తేదీనే రేషన్‌ బియ్యం పేదల గడప తొక్కేవి. వలంటీర్లు, ఎండీయూ వాహనాలు నేరుగా ఇళ్ల ముందరికే వచ్చి బియ్యం అందించేవి. సరుకులు ఎప్పుడొస్తాయో కార్డుదారులకు ముందే సమాచారం ఉండేది. వృద్ధులు, దివ్యాంగులు, శ్రమజీవులు ఇబ్బంది లేకుండా నాణ్యమైన బియ్యాన్ని అందుకునేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్‌ పంపిణీ వాహనాలకు స్వస్తి పలికింది. డీలర్లు చేసిన తప్పులు, సాంకేతిక సాకులు చూపుతూ కార్డుదారుల కోతలతో పేదల పొట్ట కొడుతోంది. ప్రతి నెలా రేషన్‌ పంపిణీలో జాప్యం చోటుచేసుకుంటోంది. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడలేక, పనులు మానుకుని దుకాణాల చుట్టూ తిరగలేక పేద ప్రజలు అల్లాడిపోతున్నారు. సక్రమంగా రేషన్‌ అందించని ప్రభుత్వం తీరుపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement