పలమనేరులో ఇసుక విక్రయ కేంద్రాలు! | - | Sakshi
Sakshi News home page

పలమనేరులో ఇసుక విక్రయ కేంద్రాలు!

Aug 6 2026 2:14 AM | Updated on Aug 6 2026 2:14 AM

యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్న నిర్వాహకులు కౌండిన్య నుంచి విక్రయ కేంద్రాలకు చేరుతున్నన ఇసుక డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే తంతు

పలమనేరు: కూటమి నేతలు గతంలో ఇసుకను రహస్యంగా రవాణా చేసేవారు. ఇప్పుడు మరో అడుగు మందుకు వేశారు. ఇసుక విక్రయ కేంద్రాలను ఏర్పాటుచేసుకుని యథేచ్ఛగా రవణా చేస్తున్నారు. పలమనేరు ప్రాంతం కర్ణాటకకు సరిహద్దులో ఉండడం, అక్కడ ఇసుకకు డిమాండ్‌ ఉండడంతో పట్టపగలే ఇసుకను ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా రవాణా చేస్తున్నారు. దీన్ని చూసిన జనం ఔరా అంటూ ఆశ్చర్యపోతున్నారు. డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే విక్రయ కేంద్రాలను ఏర్పాటుచేయడంపై ముక్కున వేలు వేసుకుంటున్నారు.

కౌండిన్య నుంచి ఇక్కడికి చేరుతున్న ఇసుక

ఇసుక ఫ్రీ పాలసీ పేరిట కౌండిన్య నది నుంచి సేకరించిన ఇసుకను అక్రమార్కులు కర్ణాటకాకు పంపితే ఇబ్బందిగా ఉంటుంది. దీంతో కొత్త మార్గాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. నది నుంచి హైవేలో ఇసుకను ట్రాక్టర్లలో తీసుకొస్తున్నారు. ఎవరైనా అధికారులు ప్రశ్నిస్తే తాము టౌన్‌లో ఇళ్ల నిర్మాణాలను తీసుకెళుతున్నామని నమ్మబలుకుతున్నారు. ఈ ఇసుకను పట్టణంలోని ఇసుక విక్రయ కేంద్రాలకు అమ్ముకుంటున్నారు. ఇది మంచి వ్యాపారంగా మారడంతో ఎలాంటి సమస్యలు లేకుండా నిత్యం భారీగా ఇసుక ట్రాక్టర్లు నదిలోంచి పట్టణంలోకి చేరుతున్నాయి.

ట్రాక్టర్‌ ఇసుక రూ.3,300లు

కౌండిన్య నది వద్ద ట్రాక్టర్‌ ఇసుక డెలవరీతో కలిపి రూ.2,400 ఉంది. ఇదే ఇసుకను పట్టణంలోని ఇసుక విక్రయ కేంద్రాలకు తరలిస్తే ట్రాక్టర్‌ ధర రూ.3 వేలుగా ఉంది. దీంతో ట్రాక్టర్‌కు రూ.600 లాభం. ఆపై ఇసుకను కొన్న వారు అవసరమైన వారికి విక్రయ కేంద్రాల్లో రూ.3,200 నుంచి డిమాండ్‌ను బట్టి అమ్ముతున్నారు. పట్టణంలోని డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఫారెస్ట్‌ గెస్ట్‌హౌస్‌ వద్ద ఓ ఇసుక విక్రయ కేంద్రం వెలిసింది. అలాగే గడ్డూరు కాలనీ, గుడియాత్తం రోడ్డు, బైపాస్‌ రోడ్డు తదితర ప్రాంతాల్లోనూ ఇసుక అమ్మకాలు సాగుతున్నాయి. పట్టపగలే వీరు ఇసుక వ్యాపారం చేస్తున్నారంటే రెవెన్యూ, పోలీసు, మైనింగ్‌, పంచాయతీ, ఇరిగేషన్‌ అధికారులు ఏమి చేస్తున్నారనే మాట సాధారణ జనంలో వినిపిస్తోంది. అధికార పార్టీ సపోర్ట్‌ లేకుండా ఇలా బహిరంగంగా రోడ్ల పక్కనే ఇసుక అమ్మకాలు సాధ్యమయ్యే పనేనా అనే అనుమానం వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement