రీసర్వేలో తప్పులకు తావు లేదు | - | Sakshi
Sakshi News home page

రీసర్వేలో తప్పులకు తావు లేదు

Aug 6 2026 2:14 AM | Updated on Aug 6 2026 2:14 AM

● 22ఏ అర్జీల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్‌ ● కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో నిర్వహిస్తున్న రీ సర్వేలో తప్పులు లేకుండా చూడాలని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ ఆదేశించారు. ఆయన బుధవారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించడమే రెవెన్యూ అధికారుల ప్రధాన కర్తవ్యమన్నారు. సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌లో సుమారు 150 నుంచి 170 వరకు రెవెన్యూ సమస్యలపై అర్జీలు వస్తున్నాయని చెప్పారు. వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. ప్రతి మండలంలో తహసీల్దార్లు వారానికి కనీసం 10 రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తే జిల్లా స్థాయిలో పెండింగ్‌ కేసులు తగ్గుముఖం పడతాయన్నారు.

భూ వివాద రహిత గ్రామాలే లక్ష్యం

భూ వివాద రహిత గ్రామాలే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. పొరపాటున 22(ఏ) నిషేధిత జాబితాలో నమోదైన పట్టా భూములను తొలగించే అధికారాన్ని ప్రభుత్వం ఆర్డీవోలకు బదలాయించిందన్నారు. దీంతో అర్జీలను త్వరితగతిన పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని సూచించారు. రీ సర్వేలో సరిహద్దుల నిర్ధారణ, రికార్డుల నవీకరణ, మ్యాప్‌ల తయారీ ప్రక్రియలను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్వో మోహన్‌ కుమార్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకటేష్‌, డీఎల్‌డీవో రవికుమార్‌, తదితర అధికారులు పాల్గొన్నారు.

ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి

జిల్లాలోని ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని కలెక్టర్‌ ఎంపీడీవో, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను ఆదేశించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఓవర్‌ హెడ్‌ వాటర్‌ ట్యాంకులను శుభ్రం చేసి, క్లోరినేషన్‌ చేయాలని ఆదేశించారు. ఎంపీడీవోలు, ఏఈలు క్షేత్రస్థాయిలో నీటి పైపుల మరమ్మతులను పర్యవేక్షించాలన్నారు. నీటి లభ్యతను అంచనా వేస్తూ తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. పారిశ్రామిక వాడలు, డంపింగ్‌ యార్డులకు సమీపంలో ఉన్న నీటి వనరులు, చెరువులు, చెక్‌ డ్యామ్‌లు, బోరు బావుల నీటిని ఎప్పటికప్పుడు ల్యాబ్‌లలో పరీక్షించాలని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement