కుప్పం: నియోజకవర్గంలో రూ.10 వేల కోట్లతో 32 పరిశ్రమలు ఏర్పాటుచేస్తున్నట్టు కడా ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్ తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. రెండేళ్లుగా కుప్పం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. ఒక ఫ్యాక్టరీ ప్రారంభమై పనిచేస్తోందని, 12 ఫ్యాక్టరీలు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. మరో 19 ఫ్యాక్టరీల ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు చెప్పారు. 2029 నాటికి పరిశ్రమలు పూర్తయి పనిచేస్తాయన్నారు. వీటి ద్వారా 40 వేల మంది ప్రత్యక్షంగాను, మరో 40 వేల మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతుందన్నారు. పాడి రైతులకు అనుకూలంగా మోగా పాల డెయిరీలు నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే కుప్పంలో రోజుకు 5.12 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోందన్నారు. దీన్ని రెండేళ్లలో 8 లక్షల లీటర్లకు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. కుప్పం నియోజకవర్గంలో 550 చెరువులు ఉన్నాయని, హంద్రీ–నీవా కాలువ ద్వారా ఇప్పటికి 125 చెరువులను నీటితో నింపామన్నారు. మరో ఏడాదిలో 87 చెరువులను అనుసంధానం చేసి నీరు నింపుతామన్నారు. పలమనేరు, కృష్ణగిరి వరకు నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ పనులు చేపట్టామన్నారు. త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. కుప్పం నుంచి బెంగళూరుకు ఔటర్ రింగ్ రోడ్డు పనులకు ప్రణాళికలు సిద్ధం చేశామని, త్వరలో రోడ్డు పనులకు శ్రీకారం చుడతామన్నారు. నియోజకవర్గంలో 7 వేల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు సోలార్ సిస్టం అందజేశామన్నారు. మూడు నెలల్లో ఓసీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన 42 వేల కుటుంబాలకు సోలార్ సిస్టిం అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు.
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కోసం వినతి
కుప్పం నియోజకవర్గంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కడా పీడీ వికాస్ మర్మత్‌కు జర్నలిస్టులు వినతి ప్రతం అందజేశారు. ఇప్పటి వరకు జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు ఇవ్వలేదన్నారు. నాలుగు మండలాల్లో అనేక మంది వివిధ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నారని తెలిపారు. స్పందించిన కడా పీడీ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.


