జిల్లావాసులకు కేంద్ర ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ వినిపించింది. కర్ణాటక నుంచి పడమటి మండలాల మీదుగా చిత్తూరుకు నూతన రైలు మార్గం నిర్మించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు లొకేషన్ సర్వే చేయించేందుకు చర్యలు చేపడుతోంది. కొత్త లైన్ మంజూరుపై రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. పంటల ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసుకునే వెసులుబాటు వస్తుందని వెల్లడిస్తోంది. అలాగే ప్రధాన నగరాలతో సైతం కనెక్టివిటీ పెరుగుతుందని వివరిస్తోంది.
పలమనేరు : జిల్లాలోని పడమటి మండలాలు అభివృద్ధి పరంగా ఎంతో వెనుకబడి ఉన్నాయి. కష్టపడి పంటలను సాగుచేసే రైతులున్నప్పటికీ సరైన రవాణా సౌకర్యాలు లేవు. దీంతో మార్కెటింగ్ వసతి లేక, తగిన ధర దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఈ ప్రాంతానికి రైలు మార్గం కావాలనే డిమాండ్ దశాబ్ధాలుగా ఉంది. రైలు మార్గం ఉంటే రైతులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలోని బంగారుపేట జంక్షన్ నుంచి చిత్తూరుకు కొత్త రైలుమార్గం ప్రతిపాదనకు ఓకే చెప్పింది. ఆమేరకు ఫైనల్ లోకేషన్ సర్వేకు పచ్చ జెండా ఊపింది.
తగ్గనున్న ప్రయాణ సమయం
చిత్తూరు నుంచి కర్ణాటకలోని బంగారుపేటకు రైలుమార్గం ఏర్పాటుతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వారు బెంగళూరుకు వెళ్లేందుకు ప్రయాణ సమయం ఒకటిన్నర గంటలు తగ్గుతుంది. నిత్యం ఉమ్మడి జిల్లానుంచి ఉద్యోగ, వ్యాపార, ఉపాధి నిమిత్తం వేలాదిమంది బెంగళూరుకు వెళుతుంటారు. అదే విధంగా కర్ణాటక నుంచి నిత్యం వేలాదిమంది భక్తులు తిరుమల, కాణిపాకం ఆలయాలకు వస్తుంటారు. ఈ మేరకు కొత్త రైలు మార్గం ప్రయాణికులకు చాలా సౌకర్యవంతంగా మారుతుంది.
హార్టికల్చర్ హబ్‌గా మారే అవకాశం
కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో కూరగాయల సాగు ఎక్కువ. అయితే పండించిన కూరగాయలను సుదూర ప్రాంతాలకు పంపలేని పరిస్థితి. ఇక్కడ ఎక్కువగా సాగుచేసే బంగాళాదుంప, టమాట, బీన్స్, కాలీఫ్లవర్, క్యాబేజీ, పూలు తదితర ఉత్పత్తులకు కేరళ, తెలంగాణ, గుజరాత్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, మధ్యప్రదేశ్, గోవా తదితర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. ఈ కొత్త రైలు మార్గంతో బెంగళూరు నుంచి తిరుపతి, నెల్లూరుల మీదుగా అమరావతి, హెదరాబాదుకు రవాణా సౌకర్యం వస్తుంది.
92 కిలోమీటర్ల తగ్గుదల
ప్రస్తుతం తిరుపతి నుంచి బెంగళూరుకు పాకాల, చిత్తూరు, కాట్పాడి, జోలార్‌పేట్, కుప్పం, బంగారుపేటలమీదుగా రైళ్లు వెళుతున్నాయి. దీంతో తిరుపతి నుంచి బెంగళూరుకు 325 కిమీగా దూరం ఉంది. అదే చిత్తూరు నుంచి కాణిపాకం, పలమనేరు, ముళబాగిళు మీదుగా బంగారుపేటకు లింకుగా రైలుమార్గం నిర్మిస్తే ఈ రెండు నగరాల మధ్య 92కిలోమీటర్ల దూరం తగ్గడంతోపాటు ఒకటిన్నరగంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. దీంతో చిత్తూరు జిల్లాలోని పలు పట్టణాలు అభివృద్ధి పథంలో నడిచే అవకాశముంటుంది. కర్ణాటక నుంచి కృష్ణపట్నం పోర్టుకు సైతం కనెక్టివిటీ ఏర్పడుతుంది.
నూతన రైలు మార్గం స్కెచ్


