పుత్తూరు : ప్రోటోకాల్ పాటించకపోవడమే కాకుండా మండల అభివృద్ధికి ఏమాత్రం సహకరించని పుత్తూరు ఎంపీడీఓ శ్రీదేవిని ప్రభుత్వానికి సరెండర్ చేయాలని ఎంపీపీ మునివేలు డిమాండ్ చేశారు. మంగళవారం ఎంపీడీఓ శ్రీదేవి మండల మీట్‌ను ప్రారంభించగానే ఎంపీపీ మునివేలు అడ్డుకున్నారు. మండల సమావేశంపై తమతో చర్చించకుండానే ఎలా నిర్వహిస్తారని నిలదీశారు. రూ.1.26 కోట్ల మండల పరిషత్ ఫండ్స్ ఉన్నప్పటికీ, అభివృద్ధి పనులు ఒక్కటి కూడా జరగడం లేదని ఆరోపించారు. గత సమావేశాల్లో ఆమో దం తెలిపిన అభివృద్ధి పనులను ప్రారంభించక కాలయాపన చేస్తున్నారన్నారని మండిపడ్డారు. ఇటీవల మెయిటెనెన్స్ కింద డ్రా చేసిన రూ.లక్షలకు సైతం లెక్క చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత ఎంపీపీని అని చిన్నచూ పు చూస్తున్నారన్నారు. ఈ క్రమంలో ఎంపీపీ మునివేలు వ్యాఖ్యలతో ఏకీభవించిన ఎంపీటీసీ సభ్యులు సైతం ఎంపీడీఓను సరెండర్ చేసే తీర్మానానికి ఆమోదం తెలిపారు.
చోరీ కేసులో
నిందితుడి అరెస్ట్
బంగారుపాళెం : మండలంలోని కేజీ సత్రంలో రెండు రోజుల క్రితం చోరీకి పాల్పడిన కేసులో నిందితుడిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. సదరు నిందితుడు ఆదివారం రాత్రి సప్లయర్స్‌లో తాళాలు పగులగొట్టి రూ.5 వేల నగదు, నల్లగంగమ్మ ఆలయంలో హుండీ పగులగొట్టి అందులోని రూ.1,060 విలువైన కానుకలు దోచుకుపోయిన ఘటనలపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ క్రమంలో కేజీ సత్రం వద్ద తనిఖీలు చేపట్టగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న సల్లసిద్ధనపల్లెకు చెందిన క్రాంతి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. విచారణలో కేజీ సత్రంలో చోరీలకు పాల్పడినట్లు తెలిసిందని, నిందితుడి నుంచి రూ.6,060 నగదు స్వాధీనం చేసుకున్నామని వివరించారు.
అక్షరాలా దందా!
సాక్షి, టాస్క్‌ఫోర్స్: జిల్లాలోని ప్రభుత్వ జూనియ ర్ కళాశాలల్లో కాంట్రాక్ట్ ప్రాతిపధికన కొన్నేళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లను శాశ్వత అధ్యాపకులుగా క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఫైల్‌ను కదిలించిందనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇదే అదునుగా కొందరు అధికార పార్టీ నేతలు, జూనియర్ లెక్చరర్స్ అసోసియేన్‌లోని కొంతమంది నేతలతో చేతులు కలిపి పెద్ద ఎత్తున దందా చేసినట్లు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే ఈస్ట్, వెస్ట్ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలోని కొందరు అసోసియేషన్ నేతలు కాంట్రాక్ట్ జేఎల్స్ వద్ద క్రమబద్ధీకరణ కోసం పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు రావడం గమనార్హం.
వసూళ్ల పర్వం
తిరుపతి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రస్తుతం 124 మంది కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. ఇందులో కొందరు అభ్యర్థులు ఫేక్ ధృవ పత్రాలతో ఉద్యోగంలో చేరారనే ఆరోపణలు ఉన్నాయి.


