పకడ్బందీగా పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్లు

Aug 5 2026 12:24 AM | Updated on Aug 5 2026 12:24 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో ఈ నెల 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌ తమీమ్‌ అన్సారియా మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. జిల్లా స్థాయిలో డీఈఓ, స్కూల్‌ స్థాయిలో పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్‌ జాతీయ జెండాను ఆవిష్కరించాలని సూచించారు. చైర్మన్‌ అందుబాటులో లేకుంటే హెచ్‌ఎం, ప్రిన్సిపల్‌ జెండాను ఎగురవేయాలన్నారు. అలాగే విద్యార్థులకు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసంగాలు, వ్యాసరచన, క్విజ్‌ పోటీలు నిర్వహించాలని పేర్కొన్నారు. వేడుకలకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఎస్‌ఎంసీ సభ్యులతో పాటు తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించి భాగస్వాములను చేయాలన్నారు. జాతీయ జెండా నియమావళి, ప్రభుత్వ ఆదేశాలను విస్మరించకుండా జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు.

స్ఫూర్తి ఉట్టిపడేలా..

దేశభక్తి, స్వాతంత్య్ర స్పూర్తి ఉట్టిపడేలా పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించాలని డీఆర్‌ఓ మోహన్‌ కుమార్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమం, ప్రగతిని స్పష్టంగా చాటిచెప్పేలా విద్యుత్‌ శక్తి, మెడికల్‌, పరిశ్రమల శాఖ, సోలార్‌ ఎనర్జీ, డీఆర్‌డీఏ, డ్వామా, ఇతర సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఆకర్షణీయమైన శకటాలను, స్టాళ్లను ప్రదర్శించాలని సూచించారు. వివిధ శాఖలలో ఉత్తమ సేవలందించిన అధికారులు, సిబ్బంది జాబితాను ఈ నెల 10వ తేదీ నాటికి సిద్ధం చేయాలన్నారు. అలాగే 12 రంగాలకు చెందిన విశిష్ట వ్యక్తులకు ప్రత్యేక అవార్డులను ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ సయ్యద్‌ మహబూబ్‌ బాషా, ఆర్‌డీఓ శ్రీనివాసులు నాయుడు, డ్వామా పీడీ రవికుమార్‌, డీపీఓ సుధాకర్‌ పాల్గొన్నారు.

బెంచీలు ఇస్తామని డబ్బు స్వాహా

పలమనేరు: పట్టణానికి చెందిన ఓ ప్రైవేటు స్కూలు నిర్వాహకుడు దామోదర్‌ శెట్టి తన బడిలో బెంచీల కోసం ఆన్‌లైన్‌లో చూసి విజయవాడకు చెందిన అరుణ్‌ అనే వ్యక్తితో బేరం మాట్లాడారు. అతను చూపిన నమూనాల మేరకు 150 బెంచీలకు 5.75 లక్షలు అవుతుందని చెప్పాడు. దీంతో దామోదర్‌ శెట్టి ఆయనకు 2.75 లక్షలను నగదు బదిలీ చేశారు. అయితే నెల రోజులుగా ఎదురుచూసినా బెంచీలు రాలేదు. అరుణ్‌కు కాల్‌ చేసేందుకు ప్రయత్నిస్తే అతని ఫోను పనిచేయలేదు. దీనిపై ఆరా తీశాడు. అతనికి ఎలాంటి కంపెనీ లేదని మోసపోయినట్టు బాధితుడు తెలుసుకున్నారు. మంగళవారం స్థానిక పోలీసులు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసి విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement