చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా లో ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను సిద్ధం చేయడంలో జాప్యం, విద్యాశాఖ అధికారుల అలసత్వంపై ‘సాక్షి’ పత్రికలో ‘టీచర్ల సీనియారిటీ జాబితాలపై వీడని చిక్కుముడి’ శీర్షికతో ఈ నెల 4 వ తేదీన కథనం ప్రచురితమైంది. దీనిపై విద్యాశాఖ అధికారులు స్పందించారు. వెంటనే జాబితాలను ప్రచురించారు.
వెబ్‌సైట్‌లో జాబితాలు
పొరుగు జిల్లాల్లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆధారంగా సీనియారిటీ జాబితాలు పూర్తి కావస్తున్నా, చిత్తూరు జిల్లాలో మాత్రం ప్రచురించకపోవడంపై ‘సాక్షి’ పత్రిక ప్రత్యేక కథనంతో వెలుగులోకి తెచ్చింది. దీనిపై స్పందించిన విద్యాశాఖ అధికారులు స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించిన జనరల్ సీనియారిటీ జాబితాలను విడుదల చేశారు. మేనేజ్‌మెంట్ల వారీగా (ప్రభుత్వ, జెడ్పీ, ఎంపీపీ, మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్) సీనియారిటీ జాబితాలను ఎంఈఓలు, డీవైఈఓలు మెయిల్స్‌కు పంపడంతో పాటు అధికారిక డీఈఓ వెబ్‌సైట్‌లో అందుబాటు లో పెట్టారు. గతంలో నాలుగు విడతలుగా స్వీకరించిన అభ్యంతరాలను పరిశీలించి సవరించిన సీని యారిటీ జాబితాలను రూపొందించినట్లు డీఈఓ తెలిపారు. విడుదల చేసిన సీనియారిటీ జాబితాపై ఉపాధ్యాయులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తగిన ఆధారాలతో ఈ నెల 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు చిత్తూరులోని డీఈఓ కార్యాలయంలో నేరుగా సమర్పించాలని స్పష్టం చేశారు.


