నడవలేని స్థితిలో ఉన్నాను. నాకు నా తండ్రి రాసిచ్చిన వీలునామా ప్రకారం భూమి వాటాను తమ్ముడు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. నాకు న్యాయం చేయండి సామీ! అని మండల కేంద్రమైన పెద్దపంజాణికి చెందిన దివ్యాంగుడు పి.మునివెంకటరెడ్డి డీఆర్వో ముందు కన్నీటి పర్యంతమయ్యాడు. పెద్దపంజాణి గ్రామానికి చెందిన పి. వెంకటరామరెడ్డి ఖాతా నంబరు 342లో మొత్తం 20.10 ఎకరాల భూమి ఉంది. తండ్రి రాసిన వీలునామా ప్రకారం ఈ ఆస్తిని మూడు భాగాలుగా విభజించగా, రెండవ భాగం పి.మునివెంకటరెడ్డి (దివ్యాంగుడైన అర్జీదారుడు)కి, మరో భాగం భయారెడ్డికి చెందుతుంది. ప్రస్తుతం భూమిని తమ్ముడు తన పేరు మీదనే నమోదు చేసుకున్నాడు. అన్నకు భాగం ఇవ్వలేదు. తనకున్న శారీరక వైకల్యం వల్ల ఎక్కడికీ వెళ్లలేని స్థితిలో ఉన్నానని, తండ్రి వీలునామా ప్రకారం తనకు రావలసిన ఆస్తి వాటాను ఇప్పించి, న్యాయం చేయాలని ప్రాధేయపడ్డాడు. స్పందించిన డీఆర్వో మోహన్‌కుమార్ క్షేత్రస్థాయిలో భూమి రికార్డులను పరిశీలించి, వీలునామా ప్రకారం విచారణ జరిపి బాధితుడికి న్యాయం చేయాలని రెవెన్యూ, సర్వే అధికారులను ఆదేశించారు.


