యాదమరి: అడవి జంతువులను వేటాడేందుకు లైసెన్సు లేని తుపాకీ, పేలుడు పాదార్థాలతో తిరుగుతున్న ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ ఈశ్వర్ చెప్పారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ముందుగా అందిన సమాచారం మేరకు యాదమరి మండలం కృష్ణంపల్లి–వేపనపల్లి రోడ్డులో వాహనాల తనిఖీలు చేపట్టామన్నారు. ఇద్దరు యువకులు తమను చూసి పారిపోవడానికి ప్రయత్నించారని తెలిపారు. వారిని వెంబడించి పట్టుకున్నట్టు పేర్కొన్నారు. వారు గుడిపాల మండలానికి చెందిన దిలీప్, భరత్‌గా గుర్తించామన్నారు. జంతువులను వేటాడటానికి తమిళనాడులోని ఓ వ్యక్తి నుంచి తుపాకీని కొనుగోలు చేసినట్లు విచారణలో అంగీకరించినట్లు చెప్పారు. వారి నుంచి నాటు తుపాకీ, పేలుడు పదార్థాలతో పాటు ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. నిందితులపై ఆయుధాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.


