గుడిపాల: మండలంలోని గట్రాళ్లమిట్ట పంచాయ తీ శాంతినగర్‌కు చెందిన గోపీనాథ్ ఆర్టీసీ బస్సు కండెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి పోస్టాఫీసులో ఖాతా ఉంది. రెండేళ్లుగా ఇతని ఖాతాలోకి రూ.లక్షలు ఉపాధిహామీ నిధులు జమ అవుతున్నాయి. ఒక పక్క ఉద్యోగం చేస్తూ ఉపాధిహామీ పని ఎలా చేస్తారని పంచాయతీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నగదు ఫీల్డ్ అసిస్టెంట్‌కు చేరిందని తెలుస్తుంది. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రభు త్వ ఉద్యోగులకు ఉపాధిహామీ పనులు కల్పించకూడదు. ఇక్కడ మాత్రం ఏకంగా జాబ్‌కార్డ్ అందించి మరీ బిల్లులు పెట్టిన వైనం చూస్తుంటే మండలంలో ఎన్నిచోట్లా ఎన్ని లక్షలు స్వాహా అయ్యా యో ఇట్టే అర్థమవుతుంది. మరోవైపు శాంతినగర్ గ్రామానికి చెందిన శ్రీలత ఏఎన్‌ఎంగా పనిచేస్తోంది. ఆమె బ్యాంకు ఖాతాలోనూ వేలల్లో నగదు జమ అయింది.
వంక పనిచేయకుండానే బిల్లులు
గట్రాళ్లమిట్ట పంచాయతీలో తమ్మిరెడ్డిచెరువు నుంచి నత్తం గ్రామానికి వెళ్లే వంక పనులు చేసినట్లు సుమారు రూ.1.50 లక్షలు స్వాహా చేసినట్టు సమాచారం. ఇందుకు గాను రూ.3 లక్షలు ఎస్టిమేషన్ వేసి పనులు ప్రారంభిచాల్సి ఉంది. పనులు చేయకుండానే ఫీల్డ్ అసిస్టెంట్ తమ బంధువుల పేర్లను మస్టర్‌లో చూపించి సుమారు రూ.1.50 లక్షలు కాజేసినట్టు స్థానికులు చర్చించుకుంటున్నారు. పనులు చేయకుండానే బిల్లులు ఎలా మంజూరు చేస్తారని నిలదీయడంతో టీడీపీ నాయకుడైన తన భర్తను రంగంలోకి దింపింది. ఎవరైనా ఏమైనా మాట్లాడితే మీకు పనులు కల్పించేది లేదని కూలీలను బెదిరించారు. దీంతో వారు పనులు దొరకవేమోనన్న భయంతో సైలెంట్ అయిపోయారు.
రైతులకు తెలియకుండానే
కొబ్బరి మొక్కల బిల్లు స్వాహా
శాంతినగర్‌కు చెందిన బాబు అనే రైతు ఎకరాలో కొబ్బరి మొక్కలు నాటాడు. ఇందుకు సంబంధించి ఉపాధిహామీ (వీజీబీరామ్‌జీ) పథకంలో కొబ్బరి మొక్కల పెంపకం పథకం ఉందని కూడా ఆ రైతుకు తెలియదు. ఆ రైతు పొలంలో ఫారంపాండ్ గుంతలు తవ్విస్తామని చెప్పి పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్‌కార్డ్, జాబ్‌కార్డ్‌లను తీసుకొని పని కొబ్బరి మొక్కలకు బిల్లులు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న రైతు ఉపాధి హామీ కార్యాలయానికి వెళితే ఫీల్డ్ అసిస్టెంట్ చాకచక్యంగా అతన్ని మేనేజ్ చేసి ఇంటికి పంపించేసినట్టు సమాచారం. తర్వాత భూమి రికార్డులు ఇస్తే తాను బిల్లులు పెట్టిస్తానని చెప్పి ఆ రైతును నమ్మించింది. సంబంధింత అధికారులు ఈ అవినీతిని పూర్తిస్ధాయిలో విచారించి తగిన చర్యలు తీసుకోవాలని గట్రాళ్లమిట్ట గ్రామస్తులు కోరుతున్నారు. దీనిపై ఏపీవోను వివరణ కోరేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు.
ఆర్టీసీ ఉద్యోగి గోపీనాథ్‌ద్ ఖాతాలో జమైన ఉపాధిహామీ నగదు
ఏఎన్‌ఎం శ్రీలత ఖాతాలో పడిన ఉపాధి హామీ బిల్లులు
గుడిపాల మండలంలో ఉపాధిహామీ పథంకం (వీజీబీ రామ్‌జీ)లో లక్షల్లో అవినీతి జరుగుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారికి కూడా బిల్లులు పెట్టి రూ.లక్షలు స్వాహా చేస్తున్నారు. ఇందులో ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఫీల్డ్ అసిస్టెంట్ భర్త తెలుగుదేశం నాయకుడు కావడంతో అవినీతికి అడ్డూ అదుపూ లేకుండా పోతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


