● సెప్టెంబరు 14 నుంచి అక్టోబరు 4 వరకు వార్షిక ఉత్సవాలు ● ఉభయదారులు కలిసికట్టుగా విజయవంతం చేయాలి ● ఈవో పెంచలకిషోర్
కాణిపాకం: కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ 2026 సంవత్సర వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఉభయదారులు కలిసికట్టుగా పనిచేయాలని ఈవో పెంచల కిషోర్ కోరారు. మణికంఠేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ఉభయదారులు, గ్రామస్తులతో దేవస్థానం అధికారులు ముందస్తు సమావేశం నిర్వహించారు. ఈవో పెంచల కిషోర్ మాట్లాడుతూ ఈ ఏడాది వినాయక చవితి నుంచి ప్రారంభమయ్యే వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఉభయదారులందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు.
21 రోజుల పాటు ఉత్సవాలు
దేవస్థానం చైర్మన్ మాట్లాడుతూ సెప్టెంబరు 14వ తేదీ నుంచి అక్టోబరు 4వ తేదీ వరకు 21 రోజుల పాటు శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరగనున్నాయని తెలిపారు. ఉభయదారులు, స్థానిక ప్రజలు కలిసికట్టుగా శ్రమించి ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ముఖ్య అధికారులు, ఆలయ మాజీ చైర్మన్లు, పలువురు ఉభయదారులు, పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బళ్లారి రాఘవ సేవలు చిరస్మరణీయం
చిత్తూరు కలెక్టరేట్ : నాటకరంగ దిగ్గజం, సంఘ సంస్కర్త బళ్లారి రాఘవ సేవలు చిరస్మరణీయమని డీఆర్వో మోహన్ కుమార్ కొనియాడారు. కలెక్టరేట్‌లో ఆదివారం బళ్లారి రాఘవ జయంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డీఆర్వో మాట్లాడుతూ బళ్లారి రాఘవ తెలుగు, కన్నడ నాటక రంగాలకు అనేక సేవలందించారన్నారు. తన సమయాన్ని, సంపదను నాటక రంగ పురోగతికి వెచ్చించారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా టూరిజం అధికారి నరేంద్రకుమార్, టూరిజం శాఖ మేనేజర్ గౌరి, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


