తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శనివారం అర్ధరాత్రి వరకు 86,231 మంది స్వామి ని దర్శించుకున్నారు. 32,017 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.73 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనమవుతోంది. దర్శ న టిక్కెట్లు లేని వారికి 10 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకుంటున్నా రు. ఇదిలా ఉండగా సర్వదర్శనం టోకెన్లు కలి గిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది.
ఉపాధ్యాయుడి సస్పెన్షన్
తిరుపతి ఎడ్యుకేషన్ : నారాయణవనం జెడ్పీ ఉన్నత పాఠశాల తమిళ (సోషియల్) ఉపాధ్యాయుడు కె.మునివేలును సస్పెండ్ చేసినట్లు ఆదివారం డీఈఓ కేవీఎన్.కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ పాఠశాల పూర్వ విద్యార్థినికి మొబైల్ ఫోను ద్వారా అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిస్తున్నట్లు తెలిపారు. దీంతో సదరు విద్యార్థిని వేధింపులు తాళలేక మరణించించినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ మౌఖిక నివేదిక మేరకు శాఖాపరమైన విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. నారాయణవనం మండల విద్యాశాఖాధికారి విచారించి తమకు అందజేసిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఆ ఉపాధ్యాయుడిపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు డీఈఓ పేర్కొన్నారు.
అలిపిరిలో రోడ్డు ప్రమాదం
– గుర్తు తెలియని వృద్ధుడి మృతి
తిరుపతి క్రైం : తిరుపతి లోని అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అలిపిరి పోలీస్ స్టేషన్ సమీపంలోని వామన ఇన్ లాడ్జ్ వద్ద ఉదయం సుమారు 5.15 గంటల సమయంలో 65 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఓ వృద్ధుడు రోడ్డు దాటుతుండగా, లీలామహల్ నుంచి కపిలతీర్థం వైపు వెళ్తున్న బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్ ఢీకొట్టింది. ప్రమాద వృద్ధుడికి తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన మోటార్ సైకిల్‌ను నడిపిన వ్యక్తి తిరుపతికి చెందిన మాధవగా పోలీసులు గుర్తించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు.
ఆటో బోల్తా
– ఉప్పు వ్యాపారి మృతి
శ్రీకాళహస్తి రూరల్: మండలంలోని ముచ్చివోలు సమీపంలో శనివారం ఉప్పు బస్తాలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. నెల్లూరు జిల్లా, సంగం మండలం, జానగొండ దిబ్బకు చెందిన మురళి (29) అక్కడికక్కడే మృతిచెందాడు. ఆటోలో వెంకటగిరి నుంచి శ్రీకాళహస్తికి వెళ్తుండగా ముచ్చివోలు వద్ద అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్‌కి తరలించారు. మృతునికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ సీఐ ఇబ్రహీం తెలిపారు.


