కార్వేటినగరం: బంగారు గొలుసు కోసమే వెదురుకుప్పం మండలం గొడుగుచింత గ్రామంలో మే నెలలో మహిళను హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. కార్వేటినగరం సీఐ హనుమంతప్ప శనివారం వివరాలు వెల్లడించారు. గొడుగుచింత గ్రామానికి చెందిన పార్వతమ్మ (63) మే నెలలో వ్యవసాయ పొలాల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది పడి ఉండడాన్ని ఆమె కుమారులు గమనించి వెదురుకుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసునమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు దర్యాప్తును అన్ని కోణాల్లో పరిశీలించారు. మహిళలను హత్యచేసి రెండు నెలలుగా తప్పించుకు తిరుగుతున్న అదే గ్రామానికి చెందిన భాస్కర్ అనే వ్యక్తిని శనివారం వెదురుకుప్పం మండలం దేవలంపేట బస్టాప్ వద్ద అదుపులోకి అరెస్టు చేశారు. పార్వతమ్మ మెడలో నుంచి అపహరించిన 24 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. కేసును ఛేదించిన సీఐ హనుమంతప్ప, వెదురుకుప్పం క్రైమ్ కానిస్టేబుల్ లోకనాధం, కానిస్టేబుల్ గణేష్, అలాగే సిబ్బందిని ఉన్నతస్థాయి అధికారులు ప్రశంసించారు. సిబ్బందికి ఎస్పీ రివార్డును ప్రకటించారు. కార్యక్రమంలో వెదురుకుప్పం ఎస్‌ఐ నవీన్‌బాబు, ఎస్‌ఆర్‌పురం ఎస్‌ఐ సుమన్ పాల్గొన్నారు.


