పుష్పాలను తీసుకువస్తున్న అర్చకులు, అధికారులు
సుగంధ సుమాల నడుమ శ్రీవారు
వడమాలపేట (పుత్తూరు): అప్పలాయిగుంటలో వెలసిన శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో గురువారం వైభవంగా పుష్పయాగం నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువనే సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొలిపి నిత్యకై ంకర్యాలు సమర్పించారు. వైదిక కార్యక్రమాల అనంతరం దేవదేవేరుల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరిపించారు. ఈ క్రమంలోనే విశేష పుష్పాలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. సర్వభూపాల వాహనంపై స్వామివారిని కొలువుదీర్చారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకు వేద పండితుల వేదమంత్రోచ్చణాలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం నిర్వహించారు. సుగంఘ సుమాలతో స్వామివారిని అర్చించారు. సాయంత్రం 6 గంటలకు ఉభయదేవేరీల సమేతంగా శ్రీవారిని అలంకరించి వీధి ఉత్సవం జరిపించారు. డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, ఆలయ అధికారి వేణుగోపాల్, ప్రధాన అర్చకుడు సూర్యకుమారాచార్యులు పర్యవేక్షించారు.


