– కలెక్టరేట్ వద్ద ధర్నా
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో కార్మికచట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గిరిధర్‌గుప్తా, కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్ గౌరవాధ్యక్షులు వాడ గంగరాజు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం కలెక్టరేట్ వద్ధ ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులకు నెలకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని స్పష్టం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నా, కార్మికుల వేతనాలు మాత్రం పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 40 ఏళ్లుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే పనిచేస్తూ అనేక అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అలాగే మహిళా కార్మికులపై వేధింపులు మానుకోవాలని స్పష్టం చేశారు.
ప్రమాదాల నడుమ విధులు
రైతులకు ఇబ్బంది కలగకుండా రాత్రింబవళ్లు ట్రాన్స్‌ఫార్మర్‌ల మరమ్మతులు చేసే స్టోర్ కార్మికులకు సక్రమంగా వేతనాలు అందడం లేదని సీఐటీయూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను కాపాడే 108, 102, 104 వాహనాల సిబ్బందికి వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. డెయిరీలు, గార్మెంట్స్, క్వారీ, గ్రానైట్ పరిశ్రమల్లోని వేలాది మంది కార్మికులకు చట్టాలు వర్తించడం లేదని మండిపడ్డారు. జూన్ 30న కలెక్టర్ ఆదేశించిన వేతన జీఓలను ఎక్కడా అమలు చేయడం లేదని విమర్శించారు. అనంతరం డీఆరక్ష మోహన్‌కుమార్‌కి వినతిపత్రం అందజేశారు. నేతలు గోవిందప్ప, మధు, శివ పాల్గొన్నారు.


