నగరి : పీలేరు ప్రాంతంలో చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తున్నట్లు సమాచారం వచ్చిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ మల్లికార్జున హెచ్చరికలు జారీచేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ మంగళవారం అర్ధరాత్రి చెడ్డీ గ్యాంగ్ పీలేరు పరిధిలోని రెండు ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు తెలిసిందన్నారు. ఈ క్రమంలో జిల్లాలోకి కూడా ప్రవేశించే అవకాశముందని తెలిపారు. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో నివసించే వారు రాత్రి వేళ తలుపులు, కిటికీలను మూసివేయాలని, ఇంటి పరిసరాల్లో తగినంత వెలుతురు ఉండేలా చూసుకోవాలని సూచించారు. అనుమానితులను గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌న్‌కు సమాచారం అందించాలని కోరారు. అలాగే కుటుంబ సభ్యులంతా ఊరికి వెళ్లే సందర్భంలో బంగారం, నగదు వంటి విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచాలని స్పష్టం చేశారు. వీలైతే ఇంటికి తాళం వేసి వెళ్లే ముందు స్థానిక పోలీసులకు సమాచారమిస్తే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ మేరకు పుకార్లను నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు.


