చిత్తూరు కార్పొరేషన్ : విద్యుత్ బిల్లు చెల్లింపులకు తిరిగి యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ట్రాన్స్‌కో చిత్తూరు అర్బన్ ఈఈ మునిచంద్ర తెలిపారు. సుమారు ఏడాదిన్నరగా యూపీఐ ద్వారా కరెంటు బిల్లులు చెల్లింపు విధానం నిలిపినట్లు వెల్లడించారు. దీంతో వినియోగదారులు విద్యుత్‌శాఖ వెబ్‌సైట్, లింక్, మనమిత్ర యాప్ ద్వారా బిల్లులు కట్టేవారన్నారు. బిల్లుల చెల్లింపు సులభతరంగా చేయడానికే ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, బీబీపీఎస్ యాప్‌లకు అనుమతించినట్లు వివరించారు. వినియోగదారులు గమనించాలని కోరారు.
శాస్త్రోక్తం.. సత్యనారాయణవత్రం
కాణిపాకం : పౌర్ణమి పురస్కరించుకుని కాణిపాకంలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవరదరాజ స్వామి వారి ఆలయంలో బుధవారం శాస్త్రోక్తంగా సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. వైభవంగా వ్రత క్రతువును జరిపించారు.
పకడ్బందీగా
వ్యర్థాల నిర్వహణ
చిత్తూరు కార్పొరేషన్ : గ్రామీణ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పకడ్బందీగా వ్యర్థాల నిర్వహణ చేపట్టాలని పంచాయతీరాజ్ అదనపు కమిషనర్ సుధాకర్‌రావు ఆదేశించారు. బుధవారం జెడ్పీ కార్యాలయంలో చేపట్టిన ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శుల సదస్సులో ఆయన మాట్లాడారు. చెత్తను సంపదగా మార్చాలని కోరారు. గ్రీన్ అంబాసిడర్లకు అదనపు ఆదాయం కల్పించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. పశువుల నుంచి వచ్చే పేడను రైతుల సహకారంతో సేకరించి వర్మీకంపోస్టుగా తయారు చేయాలని సూచించారు. ఇంటింటి నుంచి సేకరించే తడి, పొడి చెత్తను తప్పనిసరిగా వేరు చేయించాలన్నారు. తడి చెత్తతో వర్మీ కంపోస్టు తయారు చేసి, పొడి చెత్తను గ్రామంలో నిల్వ ఉంచి స్వచ్ఛ రథాల ద్వారా విక్రయించే విధానం అమలు చేయాలని సూచించారు. గ్రీన్ అంబాసిడ్లకు అదనంగా రూ.5వేల వరకు ఆదాయం వచ్చే మార్గాలను అన్వేషించాలని స్పష్టం చేశారు. జెడ్పీ సీఈఓ రవికుమార్‌నాయుడు, డీపీఓ సుధాకర్‌రావు, డిప్యూటీ సీఈఓ వెంకటనారాయణ పాల్గొన్నారు.


