చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యమివ్వాలని, త్వరితగతిన అనముతులు మంజూరు చేయాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా పారిశ్రామిక, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి కుటుంబం నుంచి ఒకరిని పారిశ్రామిక వేత్తగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువత, మహిళలకు పరిశ్రమల ఏర్పాటులో విశేష ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌లో అందించిన దరఖాస్తులను పారదర్శకంగా సమీక్షించి సింగిల్ విండో విధానంలో ఆమోదించాలన్నారు. అవసరమైతే ఒక్క రోజులోనే అనుమతులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పారిశ్రామికవేత్తల నుంచి అందిన 23 ప్రోత్సాహక క్లెయిమ్‌లకు గాను రూ.1.48 కోట్లు ఆమోదించినట్లు తెలిపారు. పూర్తి వివరాలు లేని మరో క్లెయిమ్‌ను వాయిదా వేశామన్నారు. పారిశ్రామికవేత్తలు తమ సమస్యలు, అవసరాలను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సంబంధిత పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం జిల్లాలో 36 పరిశ్రమలు, 12 విద్యుత్ ఉపకేంద్రాలు (సబ్‌స్టేషన్లు), 7 పారిశ్రామిక పార్కుల ప్రాజెక్టులు ప్రగతిలో ఉన్నాయని వివరించారు. ఏపీఐఐసీ జోనల్ మేనేజర్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ, పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ వారానికి ఒకసారి ప్రాజెక్టుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. బ్యాంకుల్లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రుణ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన మంజూరు చేయించాలని స్పష్టం చేశారు. సమావేశంలో పరిశ్రమల సంఘం నేతలు గోవర్ధన్‌బాబీ, పరిశ్రమల శాఖ జీఎం సూరిబాబు, ఎల్‌డీఎం షేక్ ఇనుల్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ అమీర్, అగ్నిమాపక శాఖ అధికారి పెద్దిరెడ్డి పాల్గొన్నారు.


