30 ఏళ్లకు పైబడిన మహిళల్లోనే
అధికంగా లక్షణాలు
కుప్పంలో ఒరల్ క్యాన్సర్ల సంఖ్య అధికం
స్క్రీనింగ్ టెస్టుకు ముఖం చాటేస్తున్న వైనం
క్షేత్ర స్థాయిలో టెస్టులపై లోపిస్తున్న
అవగాహన
హెచ్చరికలు జారీచేస్తున్న
వైద్య నిపుణులు
స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది (ఫైల్)
జిల్లాలో క్యాన్సర్ రక్కసి కోరలు చాస్తోంది. 30 ఏళ్లు దాటిన మహిళలనే లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తోంది. వారినే నమ్ముకున్న కుటుంబాలకు తీరని శోకాన్ని మిగుల్చుతోంది. కడుపున పుట్టిన బిడ్డలను అనాథలను చేసి వీధిన పడేస్తోంది. ఈ మహమ్మారిపై సరైన అవగాహన లేకపోవడం.. మహిళలు స్క్రీనింగ్ టెస్ట్‌లకు భయపడుతుండడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇలాగే కొనసాగితే పరిస్థితి మరింత దిగజారుతుందని అధికార యంత్రాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
కాణిపాకం: జిల్లా జనాభా సుమారు 15 లక్షలు ఉండగా ఇప్పటివరకు ఆరోగ్యశాఖ చేపట్టిన స్క్రీనింగ్ కార్యక్రమాల్లో 6.2 లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో సర్వైకల్ క్యాన్సర్ నిర్ధారణ కేసులు 131, అనుమానిత కేసులు 3,200, ఒరల్ క్యాన్సర్ నిర్ధారణ కేసులు 192, అనుమానిత కేసులు 6,100, బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు 171, అనుమానిత కేసులు 1,040 నమోదయ్యాయి. ఈ గణాంకాలు జిల్లాలో క్యాన్సర్ ముప్పు ఎంత వేగంగా పెరుగుతోందో తెలియజేస్తున్నాయి.
స్క్రీనింగ్ టెస్టులకు దూరం
ప్రభుత్వం విలేజ్ హెల్త్ క్లినిక్‌ల నుంచి జిల్లా ఆస్పత్రుల వరకు ఉచితంగా స్క్రీనింగ్ టెస్టులు అందుబాటులో ఉంచింది. అయినప్పటికీ ప్రజలు వాటిని పెద్దగా వినియోగించుకోవడం లేదు. గ్రామీ ణ ప్రాంతాల్లో అవగాహన లోపం, భయం, నిర్ల క్ష్యం కారణంగా పరీక్షలకు హాజరయ్యే వారి సంఖ్య తక్కువగా ఉంది. ఇక తిరుపతిలోని రుయా ప్రభుత్వ ఆస్పత్రిలో క్యాన్సర్ స్క్రీనింగ్, చికిత్స ఉంది. పీఓయూ రూమ్ నెం.222లో ప్రతి మంగళ, గురువారాల్లో నిపుణుల సేవలు అందుబాటులో ఉన్నాయి. దీనిపై కూడా ప్రజల్లో చాలా మందికి అవగాహన లేదు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి పరీక్ష అవసరమని, 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కనీసం ఆరు నెలలకు ఒకసారి స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్న సమస్యలైనా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని పేర్కొంటున్నారు.
నిర్లక్ష్యం చేయొద్దు
మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ప్రారంభ దశలో లక్షణాలు స్పష్టంగా లేకపోవడం, పరీక్షలకు ముందుకు రాకపోవడం వల్ల రోగం ముదిరిన తర్వాతే గుర్తిస్తున్నారు. అసాధారణ రక్తస్రావం, నొప్పులు వంటి లక్షణాలను చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. కుప్పం ప్రాంతంలో ఒరల్ క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. పొగాకు, గుట్కా, మద్యం వంటి అలవాట్లు ఈ వ్యాధికి ప్రధాన కారణాలుగా వైద్యులు చెబుతున్నారు. నోట్లో పుండ్లు, మచ్చలు వచ్చినా చాలా మంది వైద్యులను సంప్రదించడంలో ఆలస్యం చేస్తున్నారని వారు అంటున్నారు.
జిల్లాలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు


