పలమనేరు: శ్రీసముద్రపు కెరటం నాకు ఆదర్శం.. అది పడుతున్నందుకు కాదు.. పడినా మళ్లీ లేస్తున్నందుకుశ్రీ అని అంటున్నారు.. తాజాగా సివిల్ సర్వీసెస్‌లో 765 ర్యాంకు సాధించిన బైరెడ్డిపల్లి వాసి రంపం శ్రీకాంత్. గతంలో సివిల్స్‌లో 904 ర్యాంకు సాధించి ఐఆర్‌ఎస్‌లో సెలెక్ట్ అయ్యి.. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కంట్యాక్స్‌లో నాగపూర్‌లోని శిక్షణ తీసుకుంటున్నారు. శిక్షణలో ఉంటూనే మళ్లీ సివిల్స్ రాసి ఈ దఫా మరింత మెరుగైనన 765 ర్యాంకుతో సంచలనం సృష్టించాడు.
డిగ్రీ చేయడమే గొప్ప.. అలాంటిది..!
శ్రీకాంత్‌ది పలమనేరు నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లి గ్రామం. తండ్రి నాగరాజు హెచ్‌ఎంగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. తల్లి రేణుక గృహిణి. వీరు నివసించే ప్రాంతంలో డిగ్రీ చేయడమే గొప్ప. అలాంటి చోట తల్లిదండ్రులు బిడ్డను బాగా చదివించారు. ప్రాథమిక విద్య బైరెడ్డిపల్లిలో 6, 7 తరగతులు.. 8 నుంచి 10 దాకా పలమనేరులోని లిటిల్‌ఏంజెల్స్, ఇంటర్ శ్రీచైతన్యలో చదివారు. ఆపై హైదరాబాద్‌లోని సీబీఐటీ బీటెక్ కంప్యూటర్ సైన్సు.. బెంగళూరులోని ఐఐఎంలో ఎంబీఏ పూర్తి చేశారు. తొలుత అమెజాన్.. ఇప్పుడు గూగూల్‌లో కోటి ప్యాకేజీతో ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కు సెల్ఫ్‌గా ప్రిపరేషన్ చేశారు.
తండ్రి చెప్పినమాటే గుర్తుకొచ్చేదట
చిన్నప్పుడు తన తండ్రి నాగరాజు ‘నాన్న నువ్వు బాగా చదివి ఎలాగైనే కలెక్టర్ లేదా ఎస్పీ కావాలి. అప్పుడే మనలాంటి పేదలకు సాయంగా ఉండొచ్చు’ అనే మాట శ్రీకాంత్‌కు ఎప్పుడూ గుర్తుకొచ్చేదట. ప్రఖ్యాత కంపెనీలో భారీ ప్యాకేజీతో కొలువున్నా సంతృప్తి లేదు. ఎలాగూ లైఫ్‌లో సెటిల్ కావడంతో తిరుపతికి చెందిన అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ జోత్స్న కుమార్తె శ్రావ్యతో ఇతనికి ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. శ్రావ్య సైతం ఫైనాన్స్ మేనేజర్‌గా పనిచేస్తోంది. వీరికి నాలుగేళ్ల పాప ఉంది. అలా జీవితం సాఫీగా ఉన్నా సివిల్స్ కొట్టాలనే కొరత శ్రీకాంత్‌ను వేధిస్తూనే ఉండేది. దీంతో 2021 నుంచి ఆఫీసు పని ముగిశాక సెల్ఫ్ ప్రిపరేషన్ ద్వారా నాలుగు దఫాలు సివిల్స్‌రాసి రెండు సార్లు ఇంటర్యూకు వెళ్లి గతంలో విజయం సాధించారు. ఇప్పుడు కలెక్టర్ లేదా ఎస్పీ కానున్నారు.
నా లక్ష్యం అదే!
నేను ఐఆర్‌ఎస్‌లో ఇన్‌కంట్యాక్స్ అసిస్టెట్ కమిషనర్‌గా నాగపూర్‌లో శిక్షణ పొందుతున్నా. నా లక్ష్యం మాత్రం కలెక్టర్ లేదా ఎస్పీ. ఇందుకోసం శిక్షణలోనే ప్రాక్టీస్ చేశా. గత సివిల్స్ అనుభవంతో సివిల్స్‌కు మళ్లీ సెల్ఫ్ ప్రిపరేషన్ మొదలు పెట్టా.ఈ ఫలితాల్లో నా లక్ష్యం నెరవేరింది. మారుమూల గ్రామాల్లో ఉన్నామని భయపడకుండా లక్ష్యాన్ని సెట్ చేసుకుని కష్టపడితే విజయం అదే వస్తుంది. – రంపం శ్రీకాంత్, బైరెడ్డిపల్లి


