మహిళలు అభివృద్ధి చెందకపోయినా రోజుకొక సర్వే అంకెలగారడీతో రక్తికట్టించే యత్నం విస్తుపోతున్న మహిళా లోకం
మార్చిలోపు పూర్తి చేయాలంటూ ఒత్తిడి
డీఆర్‌డీఏ కార్యాలయం
చంద్రబాబు సర్కారు మాయలమరాఠిగా మారింది. మహిళలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందించకపోయినా అభివృద్ధి పేరుతో రోజుకొక సర్వేని రక్తికట్టిస్తోంది. ప్రజల ప్రయోజనాలు, సేవలకు ప్రాధాన్యత ఇవ్వకుండా డ్రామాలాడుతోంది. అంకెల గారడీతో మోసాలకు తెరలేపుతోంది. తాజాగా డీఆర్‌డీఏ శాఖ పరిధిలో మహిళా ఆర్థిక సర్వే పేరుతో మరో కొత్త డ్రామాకు తెరలేపింది. దీనిపై మహిళా లోకం విస్మయం వ్యక్తం చేస్తోంది.
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో చంద్రబాబు సర్కారు నిర్వహిస్తున్న మహిళా ఆర్థిక సర్వే విమర్శలకు తావిస్తోంది. జిల్లా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (డీఆర్‌డీఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సర్వే ప్రక్రియ, లబ్ధిదారులకు మేలు చేయడం కంటే వారి సమయాన్ని హరించే విధంగా మారింది. తెల్లారితే చాలు యాప్‌లు, లాగిన్‌లు, డేటా ఎంట్రీల పేరుతో క్షేత్ర స్థాయి సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. మహిళా సంఘాల సభ్యులను గంటల తరబడి వేచి చూసేలా చేస్తోంది. వ్యవసాయపనులు, కూలి పనులతో బిజీగా ఉండే మహిళలు, దేనికీ ఉపయోగం లేని సర్వేల కోసం తమ ఉపాధిని సైతం వదులుకోవాల్సి వస్తోంది. చంద్రబాబు సర్కారు మహిళలకు మేలు చేయకపోగా, వారి ఉపాధి పై పొట్టగొట్టే విధంగా వ్యవహరిస్తోంది.
అంకెలు...అప్‌లోడ్‌లకే
ప్రభుత్వం నుంచి అందాల్సిన వడ్డీ లేని రుణాలు, బ్యాంక్ లింకేజీలు, ఇతర సంక్షేమ పథకాల అమలుకంటే కేవలం అంకెలు.. అప్‌లోడ్‌లకే చంద్రబాబు సర్కారు పెద్దపీట వేస్తోంది. సర్వేల కోసం మా గుమ్మాల దగ్గరకు పదేపదే వస్తున్నారు కానీ, మాకు అందాల్సిన సంక్షేమ పథకాలను ఎప్పుడు అమలు చేస్తారని అడిగితే సమాధానం చెప్పేవారు కరువయ్యారని మహిళా సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత సర్కారులో సేవలకంటే సర్వేలకే ప్రాధాన్యత ఇస్తూ, క్షేత్ర స్థాయిలో అసలైన ప్రయోజనాలను అటకెక్కించార ని మహిళల నుంచి విమర్శలు వెలువెత్తుతున్నాయి.
సేవలు సున్నా–సర్వేలు మిన్న
చంద్రబాబు సర్కారు సర్వేలతో మహిళలకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుందనే అంశంపై స్పష్టత ఇవ్వడం లేదు. జిల్లాలో ప్రస్తుతం చేపడుతున్న మహిళా ఆర్థిక సర్వే పై విమర్శలు, సాంకేతక సమస్యలు వెలువెత్తుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్స్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో, ఒక్కో మహిళ వివరాలు నమోదు చేసేందుకు గంటల సమయం పడుతోంది. అధికారుల వేధింపుల వల్ల వెలుగు ఏపీఎంలు, ఈ నారీమణులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.
బాబు పాలనలో సర్వేలకే పరిమితం
జిల్లా సమాచారం
మహిళా సంఘాలు 34,923
సంఘాల సభ్యులు 3,42,443
ఈనారీలు 3,146
జిల్లాలో సాగుతున్న మహిళా ఆర్థిక సర్వే మార్చి నెలాఖరు లోపు పూర్తి చేయాలంటూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం సాగుతున్న సర్వే పై క్షేత్ర స్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కేవలం అంకెలు, కాగితాలకే పరిమితమవుతున్న ఈ ప్రక్రియ వల్ల తమకు కలిగే ప్రయోజనం శూన్యమని మహిళా సంఘాల సభ్యులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. గతంలో కూడా అనేక మార్లు ఇలాంటి వివరాలు సేకరించారని, కానీ ఆశించిన స్థాయిలో బ్యాంక్ రుణాలు, వడ్డీ లేని రుణాల బకాయిలు విడుదల కాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టాలు తీర్చే పథకాలు ఎప్పుడు అమలు చేస్తారు అంటూ పలువురు మహిళలు ప్రశ్నిస్తున్నారు.


