చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా సమగ్రాభిద్ధిలో బ్యాంకుల పాత్ర కీలకమని, బ్యాంకర్లు పేదల ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్‌లో డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమావేశాలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకర్లు చిత్తశుద్ధితో ప్రజలకు మెరుగైన సేవలందించాలన్నారు. రైతులకు, మహిళలకు పెద్దపీట వేయాలని సూచించారు. వ్యవసాయ రంగంలో రైతులకు పెట్టుబడి ఇబ్బందులు లేకుండా పంట రుణాలు, షార్ట్ టర్మ్ క్రాప్ ప్రొడక్షన్ రుణాలను సకాలంలో మంజూరు చేయాలన్నారు. స్వయం ఉపాధి, పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని కోరారు. పీఎం స్వనిధి, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలన్నారు.
సహకారం అవసరం
ప్రాధాన్యతా రంగంలో 2026–27 ఆర్థిక సంవత్స రానికి సంబంధించి రూ.16,037 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను రూపొందించినట్లు కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ తెలిపారు. గురువారం కలెక్టరేట్ లో బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయ న మాట్లాడారు. ఇందులో రైతుల రుణాల వాటా రూ.9,400 కోట్లు, ఎంఎస్‌ఎంఈలకు రూ.3,439 కోట్లు, హౌసింగ్ రూ.449 కోట్లు ఇతర రంగాలకు లక్ష్యాలను నిర్దేశించామని వివరించారు. అనంతరం సంజీవిని ప్రాజెక్టు అమలుపై పుంగనూరు నియోజకవర్గ వైద్యశాఖ అధికారులతో సమీక్షించారు. డీఎంహెచ్ సుధారాణి, వైద్యాధికారులు ప్రవీణ, ప్రసాద్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఐసీడీఎస్ సమీక్షలో కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ మాట్లాడు తూ అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింత లు, పిల్లలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఐడీల లక్ష్యాన్ని అధిగమించాలని ఆదేశించారు. ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి పాల్గొన్నారు. అనంతరం యూపీఎస్సీ పరీ క్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ఇన్‌చార్జి ఈడీ శ్రీదేవి పాల్గొన్నారు.
లక్ష్యానికి మించి రుణాలు: ఎల్‌డీఎం
జిల్లాలో రుణాల పురోగతిని ఎల్‌డీఎం హరీష్ వివరించారు. ప్రాధాన్యతా రంగాలకు రూ.11,266 కోట్ల రుణాల పంపిణీ లక్ష్యం కాగా, ఇప్పటి వరకు రూ.13,366 కోట్లు అందించాలమని తెలిపారు. అలాగే వ్యవసాయ రుణాలకు సంబంధించి రూ.9,146 కోట్ల లక్ష్యానికి గాను, రూ.11,848 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. సమావేశంలో ఆర్‌బీఐ ఎల్‌డీఓ రోహిత్, నాబార్డ్ డీడీఎం సునీల్, కన్వీనర్ ఇందిరా, డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి, జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు పాల్గొన్నారు.
ఏటీఎంల వద్ద కట్టుదిట్టంగా భద్రత: ఎస్పీ
జిల్లాలో బ్యాంకులు, ఏటీఎంల వద్ద సెక్యూరిటీ వ్యవస్థను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ఎస్పీ తుషార్ డూడి సూచించారు. జాతీ య రహదారుల సమీపంలోని ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతతో పాటు నాణ్యమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అలా రం, సెన్సార్ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ సాంకేతికతను పెంచాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100,112, పోలీస్ వాట్సాప్ నంబర్ 9440900005కు సమాచారం అందించాలని కోరారు.


