పెనుమూరు(కార్వేటినగరం : పెనుమూరు మండలం చార్వగానిపల్లి వద్ద బుధవారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. పెనుమూరు మండలం స్వామిరెడ్డిపల్లికి చెందిన మునస్వామి కుమారుడు గోవిందు(45) తహసీల్ధార్ కార్యాలయం వద్ద అర్జీలు రాస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం బైక్‌లో స్వగ్రామానికి బయలు దేరాడు. అదే సమయంలో పాకాల మండలానికి చెందిన బాబు(60) వెదురుకుప్పం మండలానికి చెందిన రెడ్డెప్ప ఆచారి(75)తో కలిసి చిత్తూరు నుంచి పెనుమూరు వైపు వస్తున్నారు. చార్వగానిపల్లి సమీపంలో రెండు వాహనాలు ఢీకొన్నాయి. గోవిందు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అలాగే బాబు, రెడ్డప్ప ఆచారి తీవ్రంగా గాయపడ్డారు. వారిని పెనుమూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి గోవిందు మృతి చెందినట్లు నిర్ధారించారు. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అలాగే తీవ్ర గాయపడిన వారిని కూడా మెరుగైన వైద్యం కోసం చిత్తూరుకు తరలించారు. పెనుమూరు ఎస్‌ఐ శ్రీనివాసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


