వివాదాల గేటుకు రైటు! | - | Sakshi
Sakshi News home page

వివాదాల గేటుకు రైటు!

Mar 5 2026 7:33 AM | Updated on Mar 5 2026 7:33 AM

● చిత్తూరు మార్కెట్‌ టెండర్లు దక్కించుకున్న ఎమ్మెల్యే వర్గం ● ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం నిరసన ● కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్న బాధితులు

చిత్తూరు అర్బన్‌ : అనుకున్నదే అయింది. రైతులు, పేదలు, రోడ్లపై చిన్నా చితకా వ్యాపారుల రక్తం రుచిమరిగిన చిత్తూరు మార్కెట్‌ గేటు వేలం పాటను స్థానిక ఎమ్మెల్యే వర్గం దక్కించుకుంది. స్థానిక మునిసిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన 2026–27 ఆర్థిక సంవత్సరానికి గేటు వసూళ్ల టెండర్‌ను రూ.65.15 లక్షలకు ఎంఆర్‌.మౌనికుమార్‌ దక్కించుకున్నాడు. గతేడాది సైతం ఇదే వ్యక్తి రూ.62.04 లక్షలకు సొంతం చేసుకున్నాడు. వేలంపాట పాడడానికి వచ్చిన ఆ పార్టీకి చెందిన సతీష్‌కుమార్‌ నాయుడు, పూర్ణచంద్రకు నిరాశే మిగిలింది. వీరు టీడీపీకి చెందిన చుడా చైర్‌పర్సన్‌ కటారి హేమలత కుటుంబానికి సన్నిహితంగా ఉంటారు. వీరు శశికళ పేరుతో మార్కెట్‌ టెండర్లలో పాల్గొనాలని చూశారు. గతేడాది సైతం సతీష్‌కుమార్‌ నాయుడు మార్కెట్‌ టెండర్లలో పాల్గొనేందుకు వస్తే భంగపాటు తప్పలేదు. ఇతను కటారి మోహన్‌, అనురాధ దంపతుల హత్య కేసులో ప్రత్యక్ష ప్రధాన సాక్షిగా ఉన్నాడు. వేలం పాటకు అనుమతి దక్కకపోవడంతో టీడీపీకి చెందిన దాదాపు 50 మంది యువకులు కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అప్పటికే గట్టి పోలీసు బందోబస్తు ఉండడంతో అందరినీ అక్కడి నుంచి పంపించేశారు. కార్పొరేషన్‌ అధికారులు ఉద్దేశపూర్వకంగానే సాల్వెన్స్‌ ఇవ్వకుండా చేశారని, ఆపై సాల్వెన్స్‌ ఇస్తామచి చెప్పి.. డిపాజిట్‌ చెల్లించడానికి వెళితే, రెవెన్యూ అధికారి గోపాలకృష్ణవర్మ ఆదేశాలతో సిబ్బంది తమ వద్ద ఆ మొత్తాన్ని కట్టించుకోలేదన్నారు. ఈ విషయాలపై కలెక్టర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తామన్నారు.

టెండర్లు ఇలా..

కూరగాయల మార్కెట్‌ గేటు వసూలు టెండర్‌ను మౌనికుమార్‌ దక్కించుకోగా.. ప్రైవేటు బస్సుల నుంచి రుసుము వసూలు చేసుకునే టెండర్‌ను ఆర్‌.రాజశేఖర్‌ నాయుడు రూ.6.85 లక్షలకు, జంతువధశాలలో రుసుముల టెండరును గౌతంకుమార్‌ రూ.2.05 లక్షలకు చేజిక్కించుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు ఈ టెండర్లు అమలు ఉంటాయి. టెండర్లను కాంట్రాక్టర్లకు అప్పగించడానికి కౌన్సిల్‌ ఆమోదం కోసం ఉంచుతామని, దీనిపై తుది నిర్ణయం కౌన్సిల్‌ తీసుకుంటుందని సహాయ కమిషనర్‌ ప్రసాద్‌ ప్రకటించారు.

నిబంధనల మేరకే..

టెండర్ల ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాం. ఇద్దరు నిర్ణీత గడువులోపు డిపాజిట్‌ చెల్లించి, సాల్వెన్స్‌ ఇచ్చారు. ఒకరు మాత్రం గడువులోపు డిపాజిట్‌ చెల్లించలేదు. అందుకే వాళ్లను వేలంపాటకు అనుమతించలేదు. నిబంధల ప్రకారమే టెండర్లు జరిగాయి. ఇందులో మాపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు.

– నరసింహ ప్రసాద్‌, కమిషనర్‌, చిత్తూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement