సర్వేలతో ఎనర్జీ తిప్పలు!
సర్వే చేయలేదంటూ ఎనర్జీ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు ఆపసోపాలు పడుతున్న జేఎల్‌ఎం–2లు
చిత్తూరు కార్పొరేషన్: రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న అంశాల పై సర్వే చేయలేదంటూ ఎనర్జీ అసిస్టెంట్లకు(జేఎల్‌ఎం–2)కు షోకాజ్ నోటీసులిస్తున్నారు. ఇప్పటికే పుంగనూరు డివిజన్‌లో నలుగురు ఎనర్జి అసిస్టెంట్లకు ట్రాన్స్‌కో అధికారులు నోటీసులు జారీ చేశారు. సక్రమంగా సర్వే చేయలేదని, వాటికి సంజాయిషీ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. వివరణ అనంతరం అధికారుల సంతృప్తి కాకపోతే సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉందని ఉద్యోగులు వాపోతున్నారు. కొందరి పై చర్యలు తీసుకుంటే అందరికీ భయం వస్తుందని ఉపక్రమించే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. దీనిపై పుంగనూరు ఈఈ శ్రీనివాసమూర్తిని కలిసి నాయకులు వినతి పత్రం అందజేశారు.
అల్లాడుతున్న ఎనర్జీ అసిస్టెంట్లు
ఎనర్జీ అసిస్టెంట్లు పేరుకు మాత్రమే సచివాలయ ఉద్యోగులే అయినా పని మొత్తం విద్యుత్‌శాఖలోనే చేయాల్సి ఉంటుంది. ఉదయం సచివాలయలంలో ముఖ హాజరు వేసుకున్న అనంతరం సాయంత్రం వరకు విద్యుత్ సబ్‌స్టేషన్, సంబంధిత సెక్షన్ల పరిధిలో విధులు నిర్వర్తిసుటారు. దీనికి అదనంగా నైట్ డ్యూటీలు చేయాల్సి ఉంటుంది. దీంతో వారు సర్వే చేయాల్సిన పనిలేదంటూ విద్యుత్‌శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు చెప్పడంతో ఆ మేరకు ఎనర్జీ అసిస్టెంట్లు సర్వేకు దూరంగా ఉన్నారు. కానీ సర్వే ప్రాధాన్యత దృష్ట్యా వారిని అందులో భాగం చేయాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు.
సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం యూనిఫైడ్ ఫ్యామిటీ సర్వే చేయాలని ఆదేశించింది. ప్రతి సచివాలయ ఉద్యోగి తమ పరిధిలోని 25 ఇళ్లలోని కుటుంబ సభ్యుల వివరాలను ప్రతి రోజూ ఆధార్, కేవైసీ చేయడంతో పాటు ఇందుకు సంబంధించిన కచ్చితమైన ఆధారాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంది. ఈ సర్వే ఽఆధారంగానే సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందించనున్నట్లు తెలుస్తోంది.
జిల్లాలోని ఎనర్జీ అసిస్టెంట్లు
సమన్వయం చేయలేక అగచాట్లు
గత డిసెంబర్‌లో వీరికి ఉద్యోగోన్నతులను ఇచ్చి..వేతనాలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక నెల ముచ్చటగా ఆ తంతు జరిగింది. ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని, వేతనాలు, పదోన్నతుల్లో కోత పెట్టింది. ఎనర్జీ అసిస్టెంట్ల ఎంపిక గతంలో సచివాలయాల పరిధిలో జరిగింది. వారిని సైతం సచివాలయ ఉద్యోగుల కిందనే రాష్ట్ర ప్రభుత్వం పరిగణిస్తోంది. కానీ జీతాలు మాత్రం విద్యుత్‌శాఖ చెల్లిస్తోంది. వీరు ఏఈ పరిధిలో పనులు చేస్తుంటారు. నూతన సర్వీసులు మంజూరు, డీసీ లిస్టు, లూజ్‌లైన్ బాగు చేయడం, 11 కేవీ బ్రేక్‌డౌన్ సరిచేయడం, ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు వంటి పనులకు లైన్‌మెన్లకు సాయంగా పనిచేస్తున్నారు. వీటికి తోడు సెక్షన్ల పరిధిలో ఉద్యోగుల సంఖ్య ఽఆధారంగా రాత్రి విధులు నిర్వహిస్తున్నారు. వీటితో ఇప్పుడు అదనంగా సర్వే పనులను సమన్వయం చేసుకోలేక తిప్పలు పడుతున్నారు. అయితే రోజు సర్వేకే సమయం సరిపోతోందని వీటితో పాటు విద్యుత్ సమస్యలు పరిష్కారించాలని అధికారులు ఒత్తిడి ఎక్కువగా ఉందని ఆందోళన చెందుతున్నారు.
సర్వేలతో ఎనర్జీ తిప్పలు!


