టమాట వినదే!
పలమనేరు: ఈ దఫా తొలి సీజన్ మొదలైనప్పటి నుంచి టమాటా ధరలు ఆశించినంతగా లేవు. పలమనేరు టమాటా మార్కెట్‌లో గురువారం 15 కిలోల బాక్సు గరిష్ట ధర రూ.200, కనిష్ట ధర రూ.100 మాత్రమే పలికింది. భారీ పెట్టుబడులు పెట్టి సాగుచేసిన రైతులకు నష్టాలు తప్పటట్టు లేదు. కనీసం టమాటాలను కోసే కూలీల ఖర్చు సైతం రైతులకు దక్కని పరిస్థితి నెలకొంది.
బయటి రాష్ట్రాల్లో మొదలైన సీజన్
బయటి రాష్ట్రాల నుంచి వ్యాపారులు జిల్లాలోని మార్కెట్లకు వస్తే స్థానికంగా ధరలు బాగుండేవి. కానీ ఇదే సమయంలో సత్తీస్‌ఘడ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణాల్లో సీజన్ ఆఖరు దశలో ఉంది. దీంతో అక్కడి అవసరాలకు లోకల్ సరుకు సరిపోతోంది. అక్కడి వ్యాపారులు ఇక్కడికి రావడం లేదు. లోకల్ వ్యాపారులు మాత్రమే టమాటాలన కొనుగోలు చేస్తున్నారు.
అనంతపూర్‌లో 700 మెట్రిక్ టన్నులు
ప్రస్తుతం అనంతపురం జిల్లా నుంచి 700 మెట్రిక్ టన్నుల టమాటా రోజూ మార్కెట్లకు వస్తున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. నిత్యం అక్కడి నుంచి 300 టన్నుల దాకా ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లోని పలు మార్కెట్లకు చేరుతోంది. వేసవి మొదలు కావడంతో అక్కడి తోటల్లోని టమాటా మాగడం మొదలైంది. దీంతో ఉన్న సరుకును అమ్ముకోవాలని రైతులు మాగిన కాయలను వెంటవెంటనే కోసి ఇక్కడి మార్కెట్లకు తీసుకొస్తున్నారు. ఫలితంగా డిమాండ్ కంటే ఎక్కువగా సరఫరా ఉండడమే ఇందుకు కారణమైంది.
వేసవిలో టమాటా సాధరణ సాగు 5వేల హెక్టార్లు
ప్రస్తుతం సాగైన పంట 3వేల హెక్టార్లు
కోత దశలో ఉన్న తోటలు 600 హెక్టార్లు


