అపూర్వ ఆదరణ | - | Sakshi
Sakshi News home page

అపూర్వ ఆదరణ

Feb 13 2026 3:37 AM | Updated on Feb 13 2026 3:37 AM

అపూర్

అపూర్వ ఆదరణ

● శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామికి చెవిరెడ్డి పట్టు వస్త్రాల సమర్పణ ● తుమ్మలగుంట నుంచి శ్రీనివాస మంగాపురం వరకు పాదయాత్ర ● ప్రతి పల్లెలో శ్రీవారి సారెకు మంగళ హారతులిచ్చిన మహిళలు

ఆధ్యాత్మిక మహాపాదయాత్రకు

తిరుపతి రూరల్‌: శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవకు తిరుపతి రూరల్‌ మండలం తుమ్మలగుంటలోని కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయం నుంచి పట్టువస్త్రాలు సమర్పించడం పాతికేళ్లుగా వస్తున్న ఆనవాయితీ. అందులో భాగంగా ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి వందలాది మంది భక్తుల నడుమ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆధ్యాత్మిక మహా పాదయాత్రకు అడుగడుగునా అపూర్వ ఆదరణ లభించింది. తుమ్మలగుంటలోని కల్యాణ వెంకన్న ఆలయం నుంచి గురువారం ఉదయం 6 గంటలకు బయలుదేరిన ఆధ్యాత్మిక మహాపాదయాత్ర పేరూరు, తాటితోపు, చెర్లోపల్లి, పుదిపట్ల, గాంధీపురం, పెరుమాళ్లపల్లి, సి.మల్లవరం, కాలూరు క్రాస్‌ మీదుగా శ్రీనివాసమంగాపురం వరకు మధ్యాహ్నం 1.30 గంటలకు చేరుకుంది. చెవిరెడ్డి చేపట్టిన ఆధ్యాత్మిక మహాపాదయాత్రలో స్వామివారికి మేల్‌చాట్‌ వస్త్రంతోపాటు, శేషమాలలను పల్లెల్లో ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ప్రతి పల్లెలో శ్రీవారికి సమర్పించే సారెను గ్రామస్తులతో మోయిస్తూ వారిలో భక్తితత్వాన్ని పెంచుతూ ముందుకు సాగారు. భక్తుల గోవింద నామస్మరణలు, చెక్కభజనలు, కోలాటాలు, భజన బృందాలు, మహిళల మంగళ హారతుల నడుమ ఆధ్యాత్మిక మహా పాదయాత్ర కనులపండువగా సాగింది. చెవిరెడ్డితోపాటు ఆయన సతీమణి చెవిరెడ్డి లక్ష్మి, కుమారులు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి మహాపాదయాత్రకు వచ్చిన భక్తులు అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ ముందుకు కదిలారు.

ఆలయాధికారులకు అందజేత

తుమ్మలగుంట కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం నుంచి చెవిరెడ్డి తీసుకువచ్చిన పట్టు వస్త్రాలను శ్రీనివాసమంగాపురంలోని ఆలయాధికారులు స్వీకరించారు. ఆలయ ధ్వజస్తంభం వద్ద ఆయనకు సాదర స్వాగతం పలికిన అధికారులు ఆలయ ముఖమండపంలో పట్టువస్త్రాలు స్వీకరించారు. అనంతరం స్వామివారి దర్శనం చేయించి తీర్థప్రసాదాలు, వేద మంత్రాల నడుమ అక్షింతలు వేసి, ఆశీర్వదించారు. అనంతరం చెవిరెడ్డి నుంచి స్వీకరించిన పట్టువస్త్రాలను స్వామివారికి వినియోగించే వస్త్రాల దాతల రిజిస్టర్‌లో వారి పేరును నమోదు చేశారు.

అపూర్వ ఆదరణ 1
1/1

అపూర్వ ఆదరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement