ప్రాణహాని ఉందని డీజీపీకి ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

ప్రాణహాని ఉందని డీజీపీకి ఫిర్యాదు

Feb 13 2026 3:37 AM | Updated on Feb 13 2026 3:37 AM

ప్రాణహాని ఉందని డీజీపీకి ఫిర్యాదు

ప్రాణహాని ఉందని డీజీపీకి ఫిర్యాదు

పుత్తూరు: పలువురు అధికారుల నుంచి తనకు ప్రాణహాని ఉందని స్థానిక సమాచార హక్కుల వేదిక కార్యదర్శి కె.మురగారెడ్డి మంగళగిరిలోని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ) కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ పుత్తూరు పట్టణంలో ఈడీ.కవితారాణి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న చైన్నె శరవణ ఐ క్లినిక్‌ అక్రమ వ్యవహారాన్ని ఆర్టీఐ ద్వారా బయటపెట్టినట్టు తెలిపారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి అక్రమంగా నిర్వహిస్తున్న సదరు క్లినిక్‌ను సీజ్‌ చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో తనపై కక్ష పెంచుకొన్న కవితారాణి పుత్తూరు సీఐ రెడ్డిశేఖర్‌తో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని నాన్‌ బెయిల్‌బుల్‌ కేసును నమోదు చేయించిందని ఆరోపించారు. దీనిపై తాను హైకోర్టును ఆశ్రయించగా 41 నోటీసు ఇచ్చి నిందితుడ్ని విచారించాలని హైకోర్టు ఆదేశించిందని వెల్లడించారు. తనపై మరింతగా కక్ష పెంచుకొన్న సీఐ రెడ్డిశేఖర్‌, కవితారాణి ఇద్దరూ కలసి మళ్లీ రెండో దఫా తాను పుత్తూరులో లేని సమయంలో తాను నేరం చేసినట్లు నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదు చేసి మానసిక క్షోభకు గురిచేశారని ఆరోపించారు. వీరి చర్యలను బట్టి తనకు పై ముగ్గురి నుంచి ప్రాణహాని ఉందని, ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్లు వివరించారు. ఫిర్యాదు అందించిన వారిలో సమాచార హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణరెడ్డి, నేషనల్‌ ఆర్టీ ప్రెసిడెంట్‌ కె.శివ, ఆల్‌ ఇండియా అంబేడ్కర్‌ యువజన సంఘం జిల్లా కార్యదర్శి కుమరేశన్‌, దళిత సంఘాల ఐక్యవేదిక కార్యదర్శి అంకయ్య తదితరులు ఉన్నారు.

ఒక వ్యక్తిపై ఎన్ని కేసులైనా కట్టొచ్చు

పోలీసుల నుంచే తనకు ప్రాణహాని ఉందన్న ఆరోపణపై సీఐ రెడ్డిశేఖర్‌ని వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ ఒకే వ్యక్తి రెండవ సారి నేరం చేస్తే, రెండవ సారి కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. తప్పుడు కేసు నమోదు చేశారని చెప్పడంలో అర్థం లేదని, సాక్ష్యాలను తాము కోర్టు ముందుంచుతామన్నారు. అవసరమైతే డిఫరమేషన్‌ సూట్‌ సైతం వేస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement