బంగారు ఉంగరం అపహరణ
బంగారుపాళెం: ఓ విశ్రాంత ఉగ్యోగి బంగారు ఉంగరాన్ని మాయమాటలు చెప్పి అపహరించుకు పోయాడు ఓ అపరిచితుడు. ఈ ఘటన గురువారం బంగారుపాళెంలో జరిగింది. వివరాలు.. పట్టణానికి చెందిన లక్ష్మీపతి సోషల్ వెల్ఫేర్ డిపార్టు మెంట్‌లో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యారు. స్థానిక ముత్యాలమ్మ ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా నాలుగు రోడ్ల కూడలి సమీపంలో ఓ అపరిచిత వ్యక్తి స్కూటర్‌పై వచ్చి నమస్తే అన్నా.. బాగున్నావా అంటూ పలకరించాడు. తర్వాత లక్ష్మీపతి ఉంగరం చూసి ‘భలే ఉందే ఎన్ని గ్రాములు ఉంటుంది.. ఇలాంటిదే కొనా లనుకుంటున్నా’ అని చెప్పాడు. అనంతరం ఉంగ రం పరిశీలిస్తున్నట్లు నటించి చట్టుక్కున లాక్కుని స్కూటర్‌పై పరారయ్యాడు. దీంతో లక్ష్మీపతి చేష్టలుడిగి నిలబడిపోయాడు. కాసేపటికి తేరుకుని కుటుంబీకులతో కలిసి గాలించినా అపరిచితుడి ఆచూకీ చిక్కలేదు. చివరకు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి గురైన ఉంగరం 5 గ్రాములుంటుందని బాధితుడు వెల్లడించారు.
లారీ డ్రైవర్ ఉరి వేసుకుని ఆత్మహత్య
వి.కోట : లారీ డ్రైవర్ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని నాయకనేరి ఘాట్‌లో గురువారం చోటుచేసుకుంది. సీఐ సోమశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడు రాష్ట్రం, రాణిపేట జిల్లా, ఆర్కాడ్‌కు చెందిన జయకుమార్(34) లారీ డ్రైవర్. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జయకుమార్ వారం క్రితం బెంగళూరుకు లోడ్ వేసుకుని వెళ్లి గురువారం తిరుగు ప్రయాణం అయ్యాడు. ఈ క్రమంలో నాయకనేరి ఘాట్‌లోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద లారీని పక్కన ఆపి చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందిన్నట్లు వివరించారు. మృతుడు తాగుడుకు బానిసై భార్యతో తరచూ గొడవపడే వాడని, కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని అతని బంధువులు తెలిపినట్లు సీఐ పేర్కొన్నారు.
72 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
సుండుపల్లె : అన్నమయ్య జిల్లా సుండుపల్లె మండల పరిధిలోని పింఛా ప్రాజెక్టు సమీపంలో ఎర్రచందనం అక్రమ రవాణాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు భగ్నం చేశారు. రూ.1.65 కోట్ల విలువైన 72 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ట్రాక్టర్ నీటి ట్యాంకర్‌ను సీజ్‌చేశారు. ఈ ఘటనలో ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లు, ఇద్దరు చిత్తూరు జిల్లా వాసులు సహా నలుగురిని అరెస్టుచేసినట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున అటవీ సిబ్బందితో కలిసి నిర్వహించిన దాడుల్లో నిందితులు పట్టుబడినట్లు ప్రధాన స్మగ్లర్ల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు వారు తెలిపారు. కేసును ఛేదించిన తిరుపతి టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని టాస్క్‌ఫోర్స్ హెడ్ సుబ్బరాయుడు అభినందించారు.
అనుమతి లేకుండా
విదేశాలకు టీచర్
చిత్తూరు కలెక్టరేట్ : ఎలాంటి అనుమతులు లేకుండా పాఠశాలకు గైర్జాజరైన ఉపాధ్యాయురాలు జ్యోతిలక్ష్మికి ఆర్టికల్ ఆఫ్ చార్జెస్‌ను నమోదు చేస్తూ డీఈవో రాజేంద్రప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. గురువారం జారీచేసిన ఉత్తర్వుల మేరకు పుంగనూరు మండలం, బండపల్లి పాఠశాలలో ఎస్‌జీటీగా పనిచేస్తున్న జ్యోతిలక్ష్మికి ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అధికారు ల అనుమతి లేకుండా దీర్ఘకాలికంగా పాఠశాలకు గైర్జాజరు అయినట్లు తెలిపారు. 2024 డిసెంబర్ 3 నుంచి ఆమె పాఠశాలకు రావడం లేదన్నారు. ఎటువంటి సెలవు చీటీ ఇవ్వకుండానే ఆమె గైర్హా జరు కావడంతో విచారణ నిర్వహించినట్లు తెలిపారు. విచారణ సమయంలో ఆమె తన నివాసంలో సైతం అందుబాటులో లేరని, తదుపరి విచా రణలో ఆమె అధికారులకు తెలియకుండానే అనధికారికంగా విదేశాలకు వెళ్లినట్లు నిర్ధారణ అయినట్లు తేలిందన్నారు. ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ జారీ అయిన పది రోజుల్లోపు విద్యాశాఖ కార్యాలయంలో స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. ఒకవేళ నిర్ణీత గడువులోపు స్పందించకపోతే ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరించారు.
రెండు బస్సులు ఢీ..
పది మందికి గాయాలు
వడమాలపేట (పుత్తూరు): తిరుపతి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సత్యవేడుకు వెళుతుండగా గురువారం రాత్రి 9 గంటల సమయంలో వడమాలపేట మండలం ఎస్వీపురం వద్ద పుత్తూరు ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో సత్యవేడు బస్సు ఎదురుగా ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి స్తంభాన్ని ఢీకొనడంతో ముందు కూర్చొన్న ప్రయాణికులు సైతం గాయపడ్డారు. ఈ ప్రమాదంలో రెండు బస్సుల్లోని పది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను రెండు 108 వాహనాల ద్వారా తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు వడమాలపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బంగారు ఉంగరం అపహరణ


