యూరియాకు పరుగో.. పరుగు !
చిత్తూరులో తొలగని యూరియా కష్టాలు టోకెన్లు ఓ చోట..యూరియా మరో చోట సిఫార్సులుంటే కూర్చొబెట్టి ఇస్తున్నారు.. సామాన్య రైతులకు అగచాట్లు
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : యూరియా పంపిణీలో టోకెన్లు ఓ చోట ఇస్తూ..మరో చోట యూరి యా బ్యాగులను చూపిస్తున్నారు. ఇలా రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. అది కూడా ముందు వెళ్లే వారికి టోకెన్లు చేతికిస్తున్నారు. వెనకొచ్చేవారికి రేపు రండి అని తరిమేస్తున్నారు. సిఫార్సులుంటే కుర్చీ వేసి టోకెన్లు ఇస్తున్నారు. ఇదేమని రైతులు ప్రశ్నిస్తే.. జేడీ ఆఫీసు నుంచి సిఫార్సు అని బహిరంగంగా వెల్లడిస్తున్నారు.
సిఫార్సుల వెల్లువ
యూరియా పంపిణీలో సిఫార్సులు వెల్లువెత్తాయి. కొందరు టీడీపీ నేతలు యూరియా కోసం పట్టుబడుతున్నారు. తమ వాళ్లకే ఇవ్వాలని ముందుండి టోకెన్లు ఇప్పిస్తున్నారు. సామాన్య రైతులకు తలుపులేసి...అయినా వారికి తలుపులు తెరుస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే ..వ్యవసాయశాఖ సిబ్బంది... ఎవరికి టోకెన్లు ఇవ్వడం లేదని, జేడీ ఆఫీసు నుంచి ఫోన్ చేసినా వాళ్లకు మాత్రం టోకెన్లు ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. దీంతో అక్కడున్న రైతులంతా అవాక్కయ్యారు. దీనిపై మండల వ్యవసాయశాఖ అధికారి వేణుగోపాల్‌ను వివరణ కోరగా...యూరియా పంపిణీలో ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. ఇప్పుడే ఆ సిబ్బందిని కూడా హెచ్చరించారన్నారు. అలాంటివి జరగకుండా అందరికీ యూరియా అందేలా చూస్తామని తెలిపారు.
సుదూరంగా పంపిణీ
ఏఓ కార్యాలయంలో టోకెన్లు తీసుకున్న వారికి.. చిత్తూరు నగరం గాంధీ రోడ్డులోని జిల్లా సహకార సొసైటీ గోడౌన్‌లో యూరియా పంపిణీ చేపట్టారు. ఏఓ కార్యాలయం నుంచి గోడౌన్‌కు రెండు కి.మీ దూరం ఉంది. మండల కార్యాలయంలో టోకెన్లు తీసుకుని రైతులు పరుగు..పరుగున సొసైటీ భవనానికి చేరుకున్నారు. అప్పటికే టోకెన్ల కోసం నీరసించిపోయిన రైతులు..మళ్లీ యూరియా బ్యాగు తీసుకునేందుకు గంటల కొద్ది నిరీక్షించాల్సి వచ్చింది. ఆర్బీకేల ద్వారా పంపిణీ చేస్తే ఈ బాధలు తప్పేవని రైతులు ఆవేదనను వెళ్లగక్కుతున్నారు.
టోకెన్లకు పడిగాపులు
చిత్తూరు మండలంలో శుక్రవారం యూరియా పంపిణీ చేపట్టారు. ఇందుకు నగరంలోని మండల వ్యవసాయశాఖ కార్యాలయంలో టోకెన్ల పంపిణీ చేశారు. కొంత మందికి టోకెన్లు ఇచ్చి మరి కొంత మందికి ఇవ్వకుండా చేశారు. జిల్లా సహకార సొసైటీ వద్ద (యూరియా పంపిణీ చేస్తున్న ప్రాంతం) వద్ద రైతులు రద్దీగా ఉన్నారని టోకెన్ల పంపిణీ అర్థంతరంగా ఆపేశారు. దీంతో చాలా మంది రైతు లు మధ్యాహ్నం 2గంటల వరకు కార్యాలయం వద్ద పడిగాపులు పడ్డారు. వేచి ఉన్న వారిని రేపు రమ్మని చెప్పి పంపించేశారు. సిఫార్సులున్న వారిని లోపలికి రమ్మని చెప్పి గుట్టుగా టోకెన్లు ఇచ్చి పంపించారు. ఓ వృద్ధ మహిళా రైతు తలుపు వద్దే నిరీక్షించి తీవ్ర నిరాశతో వెనుదిరిగింది. ఆపై సిఫార్సు ఉండే వారికి మాత్రమే యూరియా ఇవ్వడం ఏమిటని పలువురు ప్రశ్నించారు. ఇక టోకెన్లు ఇక్కడ ఇస్తూ..రెండు కిలో మీటర్ల దూరంలో యూరియా ఇవ్వడం విడ్డూరంగా ఉందని వారు అసహనం వ్యక్తం చేశారు.
యూరియాకు పరుగో.. పరుగు !


