తోటలో డబ్బుల మూట
– స్వాధీనం చేసుకున్న పోలీసులు?
పలమనేరు : పట్టణ సమీపంలోని నాగమంగళం వద్ద ఓ రైతు టమాట తోటలో కూలీలు పొలం పనులు చేస్తుండగా కర్ణాటక పోలీసులు రావడం ఓ వ్యక్తిని తీసుకురావడం ఆయన చెప్పినచోట తోటలో దాచిన మూట నగదును వారు స్వాధీనం చేసుకోవడం నిమిషాల్లో జరిగిపోయింది. దీన్ని చూసిన కూలీలకు ఏమీ అర్థం కాలేదు. ఈ సంఘటన వారం క్రితం జరగ్గా ఆలస్యంగా శుక్రవారం వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా.. బేరుపల్లికి చెందిన గోవిందురెడ్డి పట్టణ సమీపంలోని ఓ వ్యక్తికి చెందిన భూమిని కౌలుకు తీసుకొని అందులో టమాట, కాకర పంటలను సాగు చేశాడు. ఆ తోటలో గుర్తు తెలియని వ్యక్తి కరెన్సీ కట్టలున్న ఓ సంచిని దాచి వెళ్లిపోయాడు. ఈ విషయం రైతుకు తెలియదు. రోజువారి కూలీలు పొలం పనులు చేస్తుండగా కర్ణాటక పోలీసులు హుటాహుటిన రావడం వాహనంలోంచి ఓ వ్యక్తిని దింపి డబ్బు ఎక్కడ దాచావో చూపించాలని చెప్పడంతో అతను దాచిన స్పాట్‌ను చూపెట్టాడు. అక్కడ సురక్షితంగా ఉన్న డబ్బు సంచిని పోలీసులు స్వాధీనం చేసుకొని వెళ్లిపోయారు. దీంతో అక్కడున్న కూలీలు ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఇంతకీ టమాట తోటలో డబ్బు సంచిని దాచిందెవరు? ఆసొమ్ము ఎవరిది? తోటలోకి ఆ వ్యక్తిని తీసుకొచ్చి సంచిని తీసుకెళ్లింది కర్ణాటక పోలీసులేనా? కాదా అనే విషయాలు ఇక్కడి పోలీసులకు సైతం తెలియకపోవడం కొసమెరుపు. తోటలోని కూలీల ద్వారా వెలుగుచూసిన ఈ విషయం ఇప్పుడు స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారింది.
పలమనేరు సమీపంలో కరెన్సీ కట్టలు దాచిన టమాట తోట ఇదే...


