భూములు లాక్కొని పొట్టకొట్టద్దు | - | Sakshi
Sakshi News home page

భూములు లాక్కొని పొట్టకొట్టద్దు

Jan 1 2026 11:11 AM | Updated on Jan 1 2026 11:11 AM

భూముల

భూములు లాక్కొని పొట్టకొట్టద్దు

శాంతిపురం : ‘ పండించిన పంటకు గిట్టుబాటు ఉండదు.. అభివృద్ధి కోసమంటూ ప్రభుత్వం ఇచ్చిన డీకేటీ భూములతో పాటు పట్టా భూములను బలవంతంగా లాక్కుంటున్నారు. అందరికీ అన్నం పెట్టే రైతు పొట్ట కొట్టద్దు.. రైతులకు జీవించే హక్కు ఉందా ? లేదా సార్‌?’ అంటూ జిల్లా కలెక్టర్‌ ముందు రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రతిపాదిత కుప్పం విమానాశ్రయ రైతులతో కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ దండికుప్పం వద్ద బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. మూడవ విడత భూ సేకరణ నోటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తూ రైతులు హై కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా రైతులు తమ అభ్యంతరాలను, ఆవేదనను జిల్లా కలెక్టరుకు నివేదించారు. బాధిత రైతు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ.. రైతలు కూలీలుగా మారతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఐదారు గ్రామాల్లోనే 2 వేల ఎకరాలను తీసుకుంటే ఈ ప్రాంతంలో రైతులు, రైతు కూలీలు, పశువులు ఉనికి కోల్పోతాయన్నారు. విమానాశ్రయ కోర్‌ ఏరియాకు 800 ఎకరాలు అవసరమైతే ఇప్పటికే 1,420 ఎకరాలను ఇప్పటికే సేకరించిన ప్రభుత్వం మళ్లీ 450 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్‌ ఇచ్చిందన్నారు. గంటన్నరలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోవచ్చని, చైన్నె, తిరుపతి ఎయిర్‌పోర్టులు అందుబాటులో ఉండగా మళ్లీ 2 వేల ఎకరాలతో విమానాశ్రయం ఎందుకని ప్రశ్నించారు. రామకుప్పం మండలం గాంధీనగరానికి చెందిన రైతు శ్రీనివాసులు మాట్లాడుతూ.. విమానాశ్రయంతో పేద కుటుంబాలు మళ్లీ రోడ్డున పడతాయని చెప్పారు. ఇతర కులాల వారి భూములను వదిలిపెట్టి కేవలం ఎస్సీలనే టార్గెట్‌ చేశారన్నారు. గత ఎన్నికల్లో గ్రామం మొత్తం తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినందుకు తమ ఊరిపై దండయాత్ర చేస్తున్నారని వాపోయారు. దండికుప్పం గ్రామానికి చెందిన లక్ష్మి మాట్లాడుతూ.. ఉన్న పది ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ మానసిక వికలాంగుడైన భర్తను పోషిస్తూ, కొడుకును చదివిస్తున్నానని చెప్పారు. భూమిని కోల్పోయి తాము బతకడంలో అర్థం లేదన్నారు. ఉన్న వాళ్లను చంపేసి భవిష్యత్తులో ఎవరినో అభివృద్ధి చేస్తామనటం న్యాయం కాదన్నారు. వెంకటేష్‌పురానికి చెందిన పెద్దన్న, సల్లాపురెమ్మ మాట్లాడుతూ, ఇప్పటికే హంద్రినీవా కాలువ, గ్యాస్‌ పైప్‌లైన్‌ కోసం భూములు ఇచ్చిన తమకు నామమాత్రంగా మిగిలిన భూములను కూడా లాక్కోవద్దని కోరారు.

నిపుణుల కమిటీ సిఫార్సు మేరకే భూ సేకరణ

ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణుల కమిటీ ఎంపిక చేసిన భూములనే విమానాశ్రయం కోసం తీసుకుంటున్నామని, ఇందులో ఎలాంటి వివక్ష లేదని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ చెప్పారు. భూములు ఎవరి స్వాధీనంలో ఉంటే వారికే పరిహారం ఇస్తామన్నారు. భూములు కోల్పోయే కుటుంబాల వివరాలను సేకరించి విమానాశ్రయ కంపెనీకి ఇచ్చి అవకాశం ఉన్న అందరికీ ఉద్యోగాలు ఇచ్చే ఏర్పాటు చేస్తామన్నారు. రైతుల సమావేశానికి ముందు దండికుప్పం గ్రామంలో పింఛన్ల పంపిణీని జిల్లా కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో కడ పీడీ వికాస్‌ మర్మత్‌, ఆర్డీవో శ్రీనివాసరాజు, డీఎస్పీ పార్థసారధి, తహసీల్దార్‌ ప్రకాష్‌కుమార్‌, రూరల్‌ సీఐ మల్లేష్‌ యాదవ్‌, ఎస్‌ఐ నరేష్‌ పాల్గొన్నారు.

– ప్రజాభిప్రాయ సేకరణలో రైతులు ఆందోళన

– ఎయిర్‌పోర్టు బాధితుల ఆక్రందన

భూములు లాక్కొని పొట్టకొట్టద్దు 1
1/1

భూములు లాక్కొని పొట్టకొట్టద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement