పల్లె పాలనపై ఆంక్షలు
చిత్తూరు కార్పొరేషన్ : కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించుకునేందుకు వీలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. టైడ్ గ్రాంట్‌ను తాగునీరు, పారిశుద్ధ్యానికి, బేసిక్ (అన్‌టైడ్) గ్రాంట్‌ను గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ప్రాథమిక అవసరాలకు (విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, వేతనాలు) వినియోగించుకునే వెసులుబాటు ఉంది. అయితే నిబంధనలను కాదని, తాము సూచించిన వాటికే ఈ నిధులను ఖర్చు పెట్టాలని ఈనెల 24న రాష్ట్ర ప్రభుత్వం పలు సూచనలు జారీ చేసింది. వీటిపై సర్పంచులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పదవీకాలం పూర్తవుతున్నా..
15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలవుతాయనే నమ్మకంతో పలు గ్రామాల్లో సర్పంచులు, అంతర్గత రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు చేయించారు. అయితే ప్రభుత్వం తాజాగా చేసిన ఆదేశాల మేరకు ఆయా పనులకు బిల్లుల విడుదలయ్యే అవకాశాలు లేనట్లే, మరో మూడు నెలల్లో సర్పంచుల పదవీకాలం పూర్తవుతున్న సమయంలో ఉమ్మడి జిల్లాకు కేంద్రం విడుదల చేసిన రూ.60.76 కోట్లు నిధులపై రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఆంక్షలు విఽధించింది.
ఆదేశాలు ఇలా..
గ్రామ పంచాయతీల్లో పేరుకుపోయిన అన్ని రకాల చెత్త కుప్పలు, పాత చెత్త సహా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలకు, 2025 డిసెంబర్ వరకు గ్రీన్ అంబాసిడర్లకు అన్ని రకాల బకాయిలను, విద్యుత్ బిల్లులు, నీటి పథకాల నిర్వహణకు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంది. మండల పరిషత్తులో లింకు రోడ్లు, చేతి పంపుల నిర్వహణ, స్వచ్ఛ రథానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించాల్సి ఉంది. జిల్లా పరిషత్‌లో సీపీడబ్ల్యూఎస్ పథకాలకు సంబంధించిన సీసీ చార్జీల చెల్లింపు, సీపీడబ్ల్యూఎస్ పథకాల నిర్వహణ అనుగుణంగా లింకు రోడ్ల మరమ్మతులు నిర్వహణకు మాత్రమే ఖర్చు చేయాలని ప్రభుత్వం సూచనలు చేసింది. ఉమ్మడి జిల్లాలోని స్థానిక సంస్థల్లో సింహభాగం వైఎస్సార్‌సీపీ చెందిన ప్రజా ప్రతినిధులే ఉన్నారు.


