జనంబాటకు విన్నపాలు
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలో మంగళవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమంలో పలు సమస్యలు నమోదు చేశామని ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఇస్మాయిల్ అహ్మద్ బుధవా రం తెలిపారు. చిత్తూరు అర్బన్, చిత్తూరు రూరల్స్, పుంగనూరు డివిజన్ల నందు 11 కేవీ లైన్ పరంగా 304 రాగా అందులో 29 పరిష్కారం అయ్యాయన్నారు. ట్రా న్స్‌ఫార్మర్ల పరంగా 24 సమస్యలు వచ్చాయని, ఎల్‌టీ లైన్ పరంగా 272 రాగా 15 పరిష్కారం చూపామని, సర్వీస్ లైన్ పరంగా 29 రాగా 5 పరిష్కరించామన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
చిత్తూరు కార్పొరేషన్ : గ్రామాల్లో పొడి చెత్త సేకరణ మరింత పటిష్టంగా చేసేందుకు స్వచ్ఛరథం కార్యక్రమం చేపడుతున్నట్లు జడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు, డీపీవో సుధాకర్‌రావ్ బుధవారం తెలిపారు. మొదటి దశలో చిత్తూరు జిల్లాలో చిత్తూరు గ్రామీణ, బంగారుపాళ్యం, ఐరాల మండలాలు, తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి, సత్యవేడు, చంద్రగిరి, అన్నమయ్య జిల్లాలో పీలేరు, మదనపల్లి మండలాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. స్వచ్ఛ రథం ఆపరేటర్లుగా పనిచేసేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తులను సంబంధిత ఎంపీడీవోలకు ఈనెల 6లోగా అందజేయాలని పేర్కొన్నారు.
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక
వెదురుకుప్పం : రాష్ట్ర స్థాయిలో జరగనున్న ఎవరెస్ట్ బేస్ క్యాంపునకు మండలంలోని చవటగుంట జూనియర్ కళాశాల ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఎం.ఆజాద్ ఎంపికై నట్లు ఎంఈఓ మహేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంగళవారం తిరుపతిలో జోనల్ లెవల్ పోటీలలో దివ్యాంగ విద్యార్థి ఆజాద్ పాల్గొని ఉత్తమ ప్రతిభను కనబరిచినట్లు చెప్పారు. త్వరలో విజయవాడలో జరిగే ఎవరెస్ట్ బేస్ క్యాంపులో పాల్గొననున్నట్లు చెప్పారు. కాగా రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యేలా తర్ఫీదు చేసిన భవిత ఉపాధ్యాయురాలు శ్యామల, గుణను అభినందించారు.
గ్రామ సర్పంచ్‌పై దాడి
గంగాధర నెల్లూరు : మండలంలోని చెర్లోపల్లిలో వ్యభిచార గృహ నిర్వాహకులు, కొంత మంది వ్యక్తులు కలిసి పెద్ద కాలువ సర్పంచ్‌పై దాడి చేసిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానిక పోలీసుల వివరాల మేరకు మండలంలోని చర్లోపల్లిలో ఓ మహిళ కొద్ది సంవత్సరాలుగా వ్యభిచార గృహం నిర్వహిస్తుండగా పలుమార్లు పోలీసులకు సర్పంచ్ ఏకాంబరం ఫిర్యాదు చేశాడని మనసులో పెట్టుకొని బుధవారం తానా జంక్షన్ వద్ద ఓ చిల్లర దుకాణంలో సర్పంచ్ ఏకాంభరం ఉండగా వ్యభిచార గృహం నిర్వాహకురాలు, ఆమె కుమారులు, మరి కొంతమంది కలిసి దాడికి యత్నించగా వెంటనే చుట్టుపక్కల ప్రజలు అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకొని జీడి నెల్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీనిపై పరస్పరం ఫిర్యాదులు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌చార్జి సీఐ నిత్యబాబు తెలిపారు.
పింఛన్ తీసుకో.. పన్ను చెల్లించేయ్
పాలసముద్రం : పింఛన్ల పంపిణీ ఇంటి పన్నుల వసూలుగా మారిందని పింఛన్ లబ్ధిదారులు వాపోయారు. మండలంలో వెంగళరాజుకుప్పం, క్రిష్ణజమ్మపురం, పాలసముద్రం గ్రామ సచివాలయ పరిధిలో పింఛన్ పంపిణీ చేస్తున్న సిబ్బంది ఇంటి పన్నుల రశీదులు తీసుకొచ్చి.. ఇటు పింఛన్ సొమ్ము ఇచ్చి.. అటు ఇంటి పన్నుల నగదు తీసుకుంటున్నారు. నిబందన ప్రకారం ఇంటి పన్ను చెల్లించాలంటే 10 రోజులకు ముందు డిమాండ్ నోటీసు ఇవ్వాలి. ఆతరువాత ఇంటి పన్నులు కట్టించుకోవాలి. పూరి గుడిసెలకు కూడా రూ.600 పైగా ఇంటి పన్నులు వసూలు చేస్తున్నారని లబ్ధి దారులు ఆవేదన చెందుతున్నారు.


