చదవడంలేదని మందలింపు.. పారిపోయిన విద్యార్థినులు
చిత్తూరు అర్బన్ : సరిగా చదవడంలేదని ఇంట్లో తల్లిదండ్రులు.. కళాశాలలో అధ్యాపకులు మందలించడంతో ముగ్గురు విద్యార్థినులు ఇంటి నుంచి పారిపోయారు. వన్‌టౌన్ సీఐ మహేశ్వర కథనం మేరకు.. నగరంలోని ఓ ప్రభుత్వ కళాశాలలో చిత్తూరుకు చెందిన 17 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలికలు, 16 ఏళ్ల వయస్సున్న మరో బాలిక స్నేహితులు. ఇటీవల ఈ ముగ్గురూ సరిగా చదవడంలేదని గుర్తించిన అధ్యాపకులు .. ఇలా చేస్తే భవిష్యత్తులో ఇబ్బంది పడుతారని చెప్పారు. విషయం పిల్లల తల్లిదండ్రులకు సైతం చెప్పడంతో వాళ్లు కూడా మందలించారు. దీంతో ముగ్గురూ కలిసి మంగళవారం కళాశాలకు వెళుతున్నట్లు చెప్పి, మధ్యాహ్నం నుంచి కనిపించకుండా వెళ్లిపోయారు. పిల్లల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తీరా ముగ్గురు బాలికలు తిరుమలలో ఉన్నట్లు గుర్తించి, అక్కడి నుంచి తీసుకొచ్చి బుధవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
కీళపట్టుకు రాకపోకలు బంద్
నగరి : జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా కీళపట్టు గ్రామం నుంచి జాతీయ రహదారికి వెళ్లే మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. సర్వీసు రోడ్డు పనులు జరుగుతున్నందున కీళపట్టు గ్రామం నుంచి జాతీయ రహదారిపైకి ఎవరూ రాకుండా రోడ్డుపై రాళ్లు మట్టి పోసి అడ్డుకట్ట వేశారు. సర్వీసు రోడ్డు వేసే వరకు కీళపట్టు ప్రజలు నగరి మీదుగా వచ్చి బైపాస్‌లో వెళ్లాల్సి ఉంది.
వైకుంఠ ద్వారంలో పలువురు ప్రముఖులు
తిరుపతి రూరల్: తుమ్మలగుంట కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఏర్పాటు చేసిన వైకుంఠ ద్వారంలో పలువురు ప్రముఖులు ప్రవేశించారు. వైఎస్సార్ సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి కుటుంబ సమేతంగా తన అనుచరులతో కలసి స్వామివారిని దర్శించారు. ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి వారికి సాదర స్వాగతం పలికి దర్శనం చేయించారు. అలాగే పలువురు రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్య శాఖాధికారులు సైతం ఆలయంలో స్వామివారిని దర్శించుకుని, వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.
చదవడంలేదని మందలింపు.. పారిపోయిన విద్యార్థినులు


