తిరుపతి జిల్లాలో చేర్చే వరకు పోరాటం ఆగదు
కార్వేటినగరం: తమ మండలాన్ని తిరుపతి జిల్లాలో కలిపేంత వరకు పోరాటం ఆగదని అఖిల పక్ష నాయకులు స్పష్టం చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని గాండ్లమిట్ట కూడలిలో అఖిలపక్ష నాయకులు శాంతియుత నిరసన చేపట్టారు. వారు మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు కార్వేటినగరంలో బాదుడేబాదుడు కార్యక్రమంలో భాగంగా కార్వేటినగరం, వెదురుకుప్పం మండలాలను తిరుపతి జిల్లాలో కలిపే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కూడా ఇదేమాదిరిగా హామీలిచ్చారన్నారు. అయితే రాష్ట్రంలో నియోజకవర్గాలు పునర్విభజన జరుగుతున్నప్పటికీ ఈ రెండు మండలాలను తిరుపతి జిల్లాలో కలపకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఇచ్చిన హామీని నెరవేర్చేవరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రసాద్‌రెడ్డి, సుబ్రమణ్యంరాజు, గౌతంరాజు, శివలింగం, పయణి పాల్గొన్నారు.
ఉపాధి పనులపై విజి‘లెన్స్’!
పులిచెర్ల(కల్లూరు): మండలంలో 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులను విజిలెన్స్ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో చేపట్టిన పనుల్లో అవకతవకలు జరిగాయని గతంలో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి కేంద్ర విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. వారి ఆదేశాల మేరకు మూడు నెలల క్రితం మండలానికి విజిలెన్స్ అధికారులు విచ్చేశారు. ఆ సమయంలో వర్షాలు పడుతుండడంతో పులిచెర్ల మండలంలోని పాళెంపంచాయతీలో రెండు ఫారంపాండ్లను తనిఖీ చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు తనిఖీలు చేస్తున్నారు. అదే విధంగా సామాజిక తనిఖీ బృందం కూడా తనిఖీలు చేపట్టింది. మంగళవారం 106 రామిరెడ్డిగారిపల్లె, పులిచెర్లలో చేసిన పనులను కొలతలు తీశారు. నివేదికలను ప్రభుత్వానికి సమర్పించనున్నారు.
తిరుపతి జిల్లాలో చేర్చే వరకు పోరాటం ఆగదు


