మా భూమిపై చల్లా బాబు పెత్తనం ఏంటి?
పలమనేరు: ‘మా భూమిపై చల్లాబాబు, అతని మనషుల పెత్తనం ఏంటి.. తనకు ఆరోగ్యం బాగోలేక కొంత ఆస్తిని అమ్ముకున్నా. దీనిపై మా కుటుంబంలో కోర్టు కేసులున్నాయు. వాటిని మేము తేల్చుకుంటాం. అయినా మా భూములపై పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జి చల్లాబాబు, ఆయన మనుషుల ప్రమేయం ఏంటి..? అని ఓ బాధితురాలు మంగళవారం పలమనేరు ఆర్‌డీవో భవానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వివరాలు.. చిత్తూరు జిల్లా, తవణంపల్లి మండలం, గాజులపల్లికి చెందిన లెట్ శంకరరాజు భార్య పరిమళకు పుంగనూరు పరిధిలో భర్త మరణాంతరం హక్కు కలిగిన కొన్ని భూములున్నాయి. బాధితురాలు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ తన చికిత్స కోసం కొంత భూమిని ఇతరులకు విక్రయించుకొంది. దీనిపై ఆమె భర్త మొదటి భార్య కుమారుడైన దినకర్ మదనపల్లి సబ్‌కోర్టులో కేసు వేశాడు. ఇలా ఉండగా చల్లా బాబుకు చెందిన మనుషులు వెంకటముని, శ్రీకాంత్ అక్కడి తహసీల్దార్ ద్వారా పలమనేరు ఆర్‌డీవోకు చెప్పించి తమ భూములు రిజిస్ట్రర్ కాకుండా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టించారని తన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై తనకు న్యాయం చేయాలని ఆర్‌డీవోను కోరింది.


