సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి
ఐరాల: సమాజంలోని ప్రతి హిందువు సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని విశిష్ట అతిథి భువనేశ్వరి పీఠం, గన్నవరం శ్రీ కమలానంద భారతిస్వామి పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని వారపు సంతలో ఆర్‌ఎస్‌ఎస్ వంద ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా మండల హిందూ సమ్మేళన ఆహ్వాన సమితి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుతగా స్వామిజీకి మండల ప్రజలు ఘన స్వాగతం పలికారు. స్థానిక బజారువీధి నుంచి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ వాహనంలో ఊరేగింపు నిర్వహించారు. స్వామిజీకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా స్వామిజీ హాజరై మాట్లాడారు. ప్రతి మనిషిలో దైవత్వాన్ని చూసిన నాడే సమ సమాజ స్థాపన సాధ్యమన్నారు. కులాన్ని ఇంటి వరకే పరిమితం చేయాలని, గడప దాటితే మనమంతా హిందువులమనే భావన అందరిలో ఉండాలని సూచించారు. సమ్మేళనంలో చిన్నారుల నృత్య ప్రదర్శనలు అలరించాయి. అనంతరం నిర్వహకులు అన్నదానం చేశారు. అతిథి విశ్రాంత ప్రధోనపాధ్యాయుడు సీతాపతినాయుడు, విభాగ్ సహకార్యవాహ ప్రధాన వక్త రెడ్డెప్ప పాల్గొన్నారు.
సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి


