‘కుట్టు’కు శఠగోపం
ఇప్పటి వరకు జిల్లాలో 9,514 మందికి శిక్షణ
ఆర్భాటంగా ప్రారంభించిన ఉచిత శిక్షణ
పేద మహిళలను మోసం చేస్తున్న చంద్రబాబు సర్కారు
సొంత ఖర్చుతో శిక్షణ పూర్తి చేసిన వేల మంది మహిళలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో వేల మంది మహిళలు బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత టైలరింగ్ శిక్షణలో పాల్గొన్నారు. ఏడాది కిందట చంద్రబాబు ప్రభుత్వం ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఆర్భాటంగా ప్రారంభించారు.ఎమ్మెల్యేలు వెళ్లి ప్రచార ఆర్భాటం చేశారు. ఈ శిక్షణకు జిల్లాలో 9,514 మంది ఇప్పటి వరకు సొంత ఖర్చులతో శిక్షణ పొందారు. వారందరికీ చంద్రబాబు ప్రభుత్వం శఠగోపం పెట్టింది. ఆర్భాటంగా ప్రారంభించిన ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రభుత్వం నీరుగార్చింది. పబ్లిసిటీ కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి చేతులు దులుపేసుకుంది.
ఆర్థిక స్వావలంబనకు టోపీ
చంద్రబాబు ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబనకు టోపీ పెట్టింది. ఇంటి పట్టున ఉంటూ పనులను చక్కదిద్దుకుంటూ ఉపాధి పొందేలా అవకాశం కల్పిస్తా మని వేల మంది మహిళలను ఉచిత టైలరింగ్ శిక్షణ పేరుతో మోసగించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ శిక్షణ ఎంతో ఉపయుక్తమని చెప్పి నట్టేటముంచారు. ఉచితంగా శిక్షణ పూర్తి చేసిన వేల మంది మహిళలకు కుట్టు మిషన్లు ఇవ్వకుండా మోసగించారు. ఉచితంగా మిషన్లు ఇవ్వనప్పుడు శిక్షణ ఎందుకు ఇప్పించారని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రా రంభంలో శిక్షణ పూర్తి చేశాక మహిళలకు ప్రభుత్వం ఉచితంగా మిషన్లు ఇస్తుందని ఎమ్మెల్యేలు ఆర్భాటంగా హామీలు ఇచ్చా రు. ఇప్పుడేమో ఆ హామీలన్నీ నీరుగారా యి. శిక్షణ పొందిన మహిళలకు కనిపిస్తే ఎక్కడ కుట్టు మిషన్లు అడుగుతారోనని ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయి పర్యటనకు కనుమరుగయ్యారు.
ఎప్పుడిస్తారు...ఎవరిని అడగాలి
శిక్షణ పొందిన మహిళలకు ఉచితంగా కు ట్టు మిషన్లు ఎప్పుడిస్తారు....ఎవరిని అడ గాలి అంటూ మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఉచితంగా శిక్షణ ఇప్పించి కుట్టు మిషన్లు ఇవ్వకుండా మోసగించడం తగదని మహిళలు పెదవి విరుస్తున్నారు. ఈ విషయంలో జిల్లా బీసీ కార్పొరేషన్ అధికారులు నోరు మెదపని పరిస్థితి. దీంతో మహిళలు కుట్టు మిషన్లు ఎప్పుడిస్తారు....ఎవరిని అడగాలనే సందేహంలో ఉన్నారు.
ఒక్కరికీ ఉచిత మిషన్ ఇచ్చిందే లేదు..
జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి ఉచిత టైలరింగ్ శిక్షణలో 9,514 మంది పాల్గొనగా, ఇందులో ఒక్కరికీ ఉచితంగా మిషన్ ఇచ్చింది లేదు. ఉచితంగా మిషన్ ఇవ్వకపోగా కనీసం ధ్రువపత్రం సైతం ఇవ్వని దుస్థితి నెలకొంది. దీంతో ఈ శిక్షణలో పాల్గొన్న వేల మంది మహిళలను చంద్రబాబు సర్కారు మోసం చేసింది. శిక్షణలో పాల్గొన్న మహిళలకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఉచిత టైలరింగ్ శిక్షణ విషయంలో మోసగించిన చంద్రబాబు సర్కారుపై మహిళలు దుమ్మెత్తిపోస్తున్నారు.


