అక్రమ గ్రావెల్‌పై జనం కన్నెర్ర
అడ్డుకున్న గ్రామస్తులు ప్రశ్నించిన వారిపై దాడి చేసిన డ్రైవర్ అర్ధరాత్రి వరకు రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు తిరుమలకుప్పం గ్రామం వద్ద ఘటన
పుత్తూరు : తమిళనాడుకు అక్రమంగా గ్రావెల్ తరలించే క్రమంలో వాహనాన్ని అతి వేగంగా నడుపుతూ పాదచారుడిని ఢీకొట్టి ప్రమాదానికి కారకుడైన టిప్పర్ డ్రైవర్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ తిరుమలకుప్పం గ్రామస్తులు శనివారం రాత్రి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ప్రమాదంపై ప్రశ్నించిన మరో వ్యక్తిపైనా దాడి చేసిన డ్రైవర్ తీరుతో ఆగ్రహించిన గ్రామస్తులు పలు టిప్పర్లను అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరి స్థితి నెలకొంది. గ్రామస్తులకు మద్దతుగా నిలిచిన వైఎస్సార్‌సీపీ రూరల్ పార్టీ ప్రెసిడెంట్ అన్నాలోకనాథం మాట్లాడుతూ.. ఆంధ్రా నుంచి తమిళనాడుకు అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న టిప్పర్లు అతివేగంగా నడపడం ద్వారా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. అక్రమంగా జరుగుతున్న గ్రావెల్ మాఫియాపై పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. శనివారం రాత్రి 9 గంటల సమయంలో నడచివెళ్తున్న శివలింగం అనే స్థానికుడు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారని, ఒకవేళ జరగరాని ప్రమాదమే జరిగి ఉంటే ఆ కుటుంబానికి దిక్కెవరని ప్రశ్నించారు. పైగా డ్రైవర్లు, క్వారీ యాజమాన్యం వ్యవహార శైలి ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదన్నారు. అధికారులు తక్షణం ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే జిల్లా ఉన్నతాధికారులు అక్రమ రవాణా చేస్తున్న క్వారీల అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం గ్రామస్తులు ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అక్రమ గ్రావెల్‌పై జనం కన్నెర్ర


