రేపు హిందూ సమ్మేళనం
ఐరాల: మండల కేంద్రంలోని వారపు సంతలో మంగళవారం ఉదయం 10 గంటలకు హిందూ సమ్మేళనం నిర్వహించనున్నట్లు మండల హిందూ సమ్మేళన ఆహ్వాన సమితి నిర్వాహకులు తెలిపారు. విశిష్ట అతిథిగా భువనేశ్వరి పీఠం, గన్నవరం శ్రీకమలానంద భారతి స్వామి హాజరవుతారని తెలిపారు. పెద్ద సంఖ్యలో హిందువులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమం ముగిసిన తరువాత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.
మత్తు పదార్థాలకు
దూరంగా ఉండాలి
యాదమరి: యువత మత్తు పదార్థాలు, గంజాయికి దూరంగా ఉండాలని డీఎస్పీ సాయినాథ్ వెల్లడించారు. ఆదివారం మండల పరిది బుడితిరెడ్డిపల్లి గ్రామంలో పశ్చిమ విభాగం సీఐ శ్రీధర్ నాయుడు, స్థానిక పోలీసులతో కలసి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలోని అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులతో పాటు వారి ఇళ్లను తనిఖీలు చేశారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమై మత్తు పదార్థాల వాడకంపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్‌ఐ, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పులిచెర్ల(కల్లూరు): చాలా రోజుల తర్వాత ఆదివారం ఒంటరి ఏనుగు మండలంలోకి వచ్చింది. పొలాల్లో ప్రవేశించి పంటలను నాశనం చేసింది. ఏడాదిగా మండలంలో తిష్ట వేసిన ఏనుగుల గుంపును నెల రోజుల క్రితం ఫారెస్టు అధికారులు ఇతర ప్రాంతాలకు మళ్లించారు. దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. పంటల సాగుకు సిద్ధమయ్యారు. తిరిగి ఆదివారం తెల్లవారుజామున మండలంలోని పాళెం పంచాయతీ కోటపల్లెలోని ఒక రైతు మామిడి తోటలోకి ఒంటరి ఏనుగు ప్రవేశించి కొమ్మలను విరిచి వేసింది. దీంతో రైతుల గుండెల్లో గుబులు పట్టుకుంది.
చరిత్రకు సాక్ష్యాలు నాణేలు
చౌడేపల్లె : పురాతన నాణేలు, కరెన్సీ నోట్లు ఆయా దేశాల చరిత్ర, నాగరికతను తెలియజేస్తాయి. గత చరిత్ర ఘనతను భావితరాల వారికి అందించాలన్న ఉద్దేశంతో పుంగనూరు పట్టణం కోనేటిపాళ్యానికి చెందిన సాయికృష్ణ ముందుకు సాగుతున్నాడు. 12 ఏళ్లుగా పురాతన నాణేతలతోపాటు వివిధ దేశాలకు చెందిన కరెన్సీ నోట్లను సేకరిస్తున్నాడు. వాటిని పాఠశాలల్లో ప్రదర్శిస్తూ చరిత్రతోపాటు పిల్లలకు స్పూర్తినింపుతున్నాడు. ప్రస్తుతం అతని వద్ద రాజుల కాలంలో వినియోగించిన 26 రకాల నాణేలు, బ్రిటీష్ పాలనలోని నాణేలు, రిపబ్లిక్ పాలనలో ఉన్న ప్రస్తుత కరెన్సీ, రద్దు చేసిన 500, 1000 నోట్లతో సహా 96 దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు ఉన్నాయి. డిజిటల్ యుగంలో తేలియాడుతున్న నేటి తరానికి మన ఘన చరితను అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు సాయికృష్ణ వెల్లడించారు.
రేపు హిందూ సమ్మేళనం
రేపు హిందూ సమ్మేళనం


