అన్నదాతకు ఆసరా
కార్వేటినగరం : గ్రామీణ ప్రాంత ప్రజలకు పాడి పంటలే జీవనాధారం. ప్రకృతి వైపరీత్యాలు, ధరల పతనం, దళారుల మోసాలతో రైతులు వ్యవసాయంలో కష్టాలు చవిచూసినప్పుడు పాడి పశువులు అన్నదాతకు ఆసరాగా నిలిచి ఆదుకుంటున్నాయి. పశుపోషణలో రైతులు సరైన అవగాహన పెంచుకుంటే సంపద వృద్ధి చెందుతుందని పశుసంవర్ధక శాఖ అధికారులు సూచిస్తున్నారు. పశు సంవర్థక శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో సుమారుగా ఆవులు 4,67,507, గేదెలు 35,036, మేకలు 13,80,063, గొర్రెలు 4,38,362 ఉన్నాయి.
ఉత్తమ జాతుల ఎంపిక మేలు
పాడి పరిశ్రమలో అధిక లాభాలు పొందాలంటే మేలు జాతి పశువులను ఎంచుకోవాలి. అధిక పాలు ఇచ్చే మేలుజాతి ముర్రా గేదె, సంకర జాతి ఆవులను ఆ ప్రాంతాలకు తగ్గట్టు పశువుల జాతులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. సంకర జాతి పశువులు ఎంపికకు ప్రాధాన్యం ఇస్తే అధిక లాభాలు సాఽధించవ చ్చు. పశువులకు సీజనల్‌గా సంక్రమించే వ్యాధులపై పాడి రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఏదైన వ్యాధి లక్షణాలు గుర్తించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా పశువైద్యులను సంప్రదించి చికిత్సలు అందించాలి.
పాడి పరిశ్రమకు ప్రోత్సాహకాలు
పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రోత్సాహకాలు, పశుదాణా, గడ్డిసాగు చేసే యంత్రాల కొనుగోలుకు ప్రభుత్వం రాయితీ అందిస్తోంది. రాయితీపై పశువుల కొనుగోలు, పశువుల పాక నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను పాడి రైతు లు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా వృద్ధి చెందాలి. – డాక్టర్. ఉమామహేశ్వరి,
జిల్లా పశుసంవర్థక శాఖ అధికారిణి, చిత్తూరు


