నకిలీలకు కళ్లెం
– వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌లు
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : చోరీలు, నేరాలు, నకిలీ నంబరు ప్లేట్లతో సంచారం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి వాహనానికి హై సెక్యూరిటీ నంబరు ప్లేట్ (హెచ్‌ఎస్‌ఆర్‌పీ)ను తప్పనిసరి చేసింది. ఇవి వాహన భద్రతను పెంచడమే కాకుండా నేరాల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
నమోదు కోసం ఇలా..
హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌ల కోసం www. siam. in వెబ్‌సైట్‌లో వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయాలి. వాహన నంబరు, ఛాసిస్ నంబరు వివరాలు పంపాలి. కంపెనీలను బట్టి నంబరు ప్లేట్లు ద్విచక్ర వాహనాలకు రూ.320 నుంచి రూ.500 వరకు, నాలుగు చక్రాల వాహనాలకు రూ.600 పైనే ఉంది. వీటిలో కావాల్సింది ఎంపిక చేసుకుని ఓటీపీ ద్వారా ఆన్‌లైన్‌లోనే నగదు చెల్లించాలి.
దీని ప్రత్యేకతలు ఇవీ..
హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌పై యూనిక్ లేజర్ ఐడీ ఉంటుంది. నకిలీగా మార్చలేని విధంగా దీన్ని రూపొందించారు. ఒకసారి అమర్చితే తొలగించడం సాధ్యం కాదు. నంబర్ ప్లేట్‌ను స్కాన్ చేయడం ద్వారా పోలీసులకు పూర్తి సమాచారం అందుతుంది.
జరిమానా తప్పదు
జిల్లాలో ఈ ప్లేట్ ప్రభావం పెద్దగా లేకపోయినా.. పక్కా రాష్రాల్లో హెచ్‌ఎస్‌ఆర్‌పీ నంబర్ ప్లేట్‌లను క్షుణంగా పరిశీలిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఈ రకమైన నంబరు ప్లేట్ లేకపోతే జరిమానాలు పడుతున్నాయి. త్వరలో ఈరకమైన నంబర్ ప్లేట్ జిల్లాలో అమలయ్యే అవకాశాలున్నాయని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు.


