మార్కులు నమోదు చేయకపోతే చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు అమలు చేస్తున్న 100 రోజుల ప్రణాళికలో విద్యార్థుల మార్కులను నమోదు చేయకపోతే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని డీఈఓ రాజేంద్ర ప్రసాద్ హెచ్చరించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు జారీ చేసిన షెడ్యూల్ మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కచ్చితంగా 100 రోజుల ప్రణాళిక అమలు చేయాలన్నారు. ఈ ప్రణాళిక అమలులో విద్యార్థులకు నిర్వహించే పరీక్షల ఫలితాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. నమోదు చేయని వారిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. 331 పాఠశాలల్లో 13,065 మంది విద్యార్థుల మార్కులను మాత్రమే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారన్నారు. మిగిలిన పాఠశాలల్లో మార్కులను ఎందుకు అప్‌లోడ్ చేయడం లేదనే అంశం పై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. క్షేత్రస్థాయిలో ఇందుకు కారణాలు పరిశీలించిన తర్వాత సబ్జెక్టు టీచర్లపై చర్యలు చేపడుతామని డీఈవో హెచ్చరించారు.


