ఆడబిడ్డని చెరువులో పడేశారా?
బంగారుపాళెం : ఆడబిడ్డ భారమని పుట్టిన వెంటనే చెరువులో పడేశారా.. భారం తగ్గించుకుందా మనుకున్నారా..లేక ఇతర కారణాలతో పుట్టిన బిడ్డను వదిలించుకుందామనుకున్నారో.. భూమి మీద పడి కళ్లు తెరవక ముందే, ఆడ శిశువుకు నూరేళ్ల నిండిపోయాయి. నవమాసాలు మోసి కన్నపేగు తెంచకుండానే పుట్టిన బిడ్డను చెరువులో పడేశారు. ఈ సంఘటన మండలంలోని తుంబకుప్పం గ్రామంలో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామ సమీపంలోని బిక్కిరెడ్డి చెరువులో శిశువు మృతదేహం తేలాడుతుండగా బుధవారం సాయంత్రం పశువుల కాపరులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి ఆడ శిశువుగా గుర్తించారు. రెండు రోజుల క్రితం పుట్టిన ఆడబిడ్డను చెరువులో పడేసినట్లు తెలుస్తోందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన శిశువు గురించి గ్రామంలో విచారణ చేశారు. గ్రామానికి చెందిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, లేక ఇతరులు ఎవరైనా బిడ్డను పడేసి వెళ్లారా అనే కోణంలో విచారణ సాగిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నట్లు తెలిపారు.


