వినూత్నం.. తక్షణ పరిష్కారం!
చిత్తూరు కార్పొరేషన్: సమస్యల పరిష్కారం కోసం ‘కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల సీఎండీగా బాధ్యతలు చేపట్టిన శివశంకర్ ఈ కార్యక్రమానికి నాంది పలికారు. మంగళవారం జిల్లాలో కార్యక్రమం ప్రారంభమైంది. ఇక వారంలో రెండు రోజులు క్షేత్ర స్థాయిలో అధికారులు, సిబ్బంది సంబంధిత సెక్షన్లలో పర్యటించి సమస్యలను గుర్తించి యాప్‌లో నమోదు చేయనున్నారు.
విన్నూత కార్యక్రమం
ఎస్పీడీసీఎల్ సీఎండీగా శివశంకర్ ఐఏఎస్ ఇటీవల బాధ్యతలు చేపట్టారు. సంస్కరణల్లో భాగంగా కరెంటోళ్ల జనబాట కార్యక్రమాని ప్రారంభించారు. తొలుత యాప్‌ను తిరుపతిలో విద్యుత్‌శాఖ మంత్రి రవికుమార్ చేతుల మీదుగా ఆరంభించారు. అనంతరం డిస్కం(రాయలసీమ, నెల్లూరు జిల్లాలు) కలెక్టర్ కర పత్రాలను విడుదల చేశారు. మంగళవారం నుంచి అధికారులు, సిబ్బంది క్షేత్ర స్థాయికి వెళ్లారు.
సమస్యలు యాప్‌లో నమోదు
● ప్రతి మండలానికి చెందిన సెక్షన్ సిబ్బంది క్షేత్ర స్థాయిలో పర్యటిస్తారు.
● ఆయా ప్రాంతాల్లోని 11 కేవీ సహా ఎల్‌టీ లైన్ల వెంట యంత్రాంగం తనిఖీ చేస్తుంది.
● పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వార్డులు లేదా వీధుల్లో విద్యుత్ స్తంభాలు ఒరిగిపోవడం, కూలిపోయేలా ఉండడం, తీగలు వేలాడడం, పాతవి కావడం, ట్రాన్స్‌ఫార్మర్ల దిమ్మెలు పగిలిపోవడం, రక్షణ కంచె లేకపోవడం, చేతికందేలా తీగలు ఉండడం వంటి వాటిని పరిశీలిస్తారు.
● ఫొటో తీసి కంపెనీ యాప్‌లో నమోదు చేస్తారు. ఆలస్యమయ్యే పనులుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తారు.
● వారంలో మంగళ, శుక్రవారాల్లో ఏఈతో సహా సిబ్బంది సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో పర్యటించనున్నారు.
● పనితీరు పరిశీలించడానికి జిల్లా స్థాయిలో జీఎం కృష్ణారెడ్డిని నోడల్ అధికారిగా నియమించారు.


